
మిథున్‌రెడ్డి అరెస్టు కక్ష సాధింపులో భాగమే
అనంతపురం కార్పొరేషన్: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉంటున్నారనే ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును ఖండిస్తూ శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. కూటమి పాలనలో కక్ష సాధింపులు తారస్థాయికి చేరాయన్నారు. భవిష్యత్తులో సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఉద్యోగులను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి స్టేట్‌మెంట్లు తీసుకున్నారని ఆరోపించారు. అక్రమ కేసులో మిథున్ రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సీఎం చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలతోనే సాగుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడంతోనే వైఎస్సార్ సీపీలోని కీలక నాయకులపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014–19 పాలనాకాలానికి సంబంధించి చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, సన్నిహితులపై 13 అవినీతి కేసులు ఉన్నాయని, ఇందులో మద్యం కుంభకోణం కేసు కూడా కీలకమైందన్నారు. ఈ కేసులను నిర్వీర్యం చేసేందుకు సీఎం పదవిని అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు. అప్పట్లో మద్యం లిక్కర్ స్కాంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారన్నారు. అలాంటి చంద్రబాబు అధికారంలోకి రాగానే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన వారిపై కేసులు పెట్టిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క బెల్ట్ షాపు లేదని, ప్రభుత్వమే పారదర్శకంగా మద్యం షాపులు నిర్వహించిందన్నారు. నేడు ఏ గ్రామంలో చూసినా బెల్ట్‌షాపులు దర్శనమిస్తున్నాయన్నారు. ప్రజాప్రతినిధులు మద్యం మాఫియాగా మారారని విమర్శించారు. సిట్ కట్టు కథలతో అల్లుతున్న మద్యం అక్రమ కేసు న్యాయస్థానాల్లో నిలబడదని ‘అనంత’ తేల్చి చెప్పారు.
బాబు రాజకీయ జీవితమంతా కుట్రలే
భవిష్యత్తులో మూల్యం
చెల్లించుకోక తప్పదు
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
‘అనంత’ ధ్వజం