ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా జేసీకి బాధ్యతలు
అనంతపురం అర్బన్: మిడ్ కెరీర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు కలెక్టర్ వి.వినోద్‌కుమార్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరికి వెళ్లారు. అక్కడి లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో ఈనెల 21 నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు 26 రోజుల పాటు ఐఏఎస్ అధికారులకు 23వ రౌండ్ ఫేజ్–3 శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణలో పాల్గొనేందుకు వెళ్లిన కలెక్టర్ తిరిగి ఆగస్టు 18న విధులకు హాజరవుతారని కార్యాలయ అధికార వర్గాలు తెలిపాయి. అప్పటి వరకు జేసీ శివ్ నారాయణ శర్మకు ఇన్‌చార్జ్ కలెక్టర్ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. రెవెన్యూ భవన్‌లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. అర్జీల స్థితిని కాల్‌సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌ద్వారా ఆన్‌లైన్‌లోనూ సమర్పించవచ్చన్నారు.
13 మండలాల్లో వర్షం
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో 13 మండలాల్లో వర్షం కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జిల్లాలో 3.9 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అనంతపురం అర్బన్‌లో 22.8 మి.మీ, విడపనకల్లు 22, కుందుర్పి 19.6, బ్రహ్మసముద్రం 12.2, అనంత పురం రూరల్ 10.2 మి.మీ వర్షపాతం నమో దైంది. పెద్దపప్పూరు, గార్లదిన్నె, కూడేరు, రాప్తాడు,బుక్కరాయసముద్రం, గుంతకల్లు, బెళుగుప్ప, యాడికి మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
పీఏబీఆర్‌లో తగ్గిన నీటి మట్టం
కూడేరు: మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్)లో నీటి మట్టం తగ్గింది. జలాశయంలోకి ఇన్‌ఫ్లో పూర్తిగా పడిపోయింది. ఈ క్రమంలో ఆదివారం నాటికి డ్యాంలో 1.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం వద్ద ఏర్పాటైన శ్రీసత్యసాయి, శ్రీరామిరెడ్డి, అనంతపురం, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లకు రోజూ సుమారు 55 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లీకేజీ, నీటి ఆవిరి, ఇతరత్రా కలిపి మొత్తం 65 క్యూసెక్కుల చొప్పున నీరు వెళ్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. డ్యాంలోకి ఇన్‌ఫ్లో లేకపోతే తాగునీటి ప్రాజెక్ట్‌లకు నీటి కొరత ఏర్పడే అవకాశముంది.

శిక్షణకు వెళ్లిన కలెక్టర్