
రాజకీయ కక్ష సాధింపులో భాగమే..
ఉరవకొండ: లిక్కర్ స్కాం పేరుతో లోక్‌సభ ప్రతిపక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిని అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని శాసనమండలి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కక్షపూరిత రాజకీయాలు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారని, అయితే ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని పేర్కొన్నారు. వాస్తవానికి 2014–19 మధ్య అప్పటి సీఎం చంద్రబాబు మద్యం విక్రయాల్లో అనేక అక్రమాలు చేసి, వివిధ కేసుల్లో ఎ–2గా ఉన్నారన్నారు. చంద్రబాబు బెయిల్‌పై బయట ఉంటూ ఈ కేసు నుంచి ఊరట పొందారని గుర్తు చేశారు. కక్ష సాధింపులను ధైర్యంగా ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు సాగిస్తామన్నారు.