
యువకుడి దుర్మరణం – నేత్రాలు దానం
గార్లదిన్నె: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చెందిన రమేష్‌రెడ్డి, తోలిశమ్మ దంపతుల పెద్ద కుమారుడు భరత్‌సింహ రెడ్డి (22) డిగ్రీ వరకు చదువుకుని, రెండేళ్లుగా బీకేఎస్ మండల పరిధిలోని వడియంపేట వద్ద ఉన్న హెచ్‌పీ గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజూ ద్విచక్ర వాహనంపై విధులకు వెళ్లి వచ్చేవాడు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు విధులకు వెళ్లిన అతను.. అనంతరం రాత్రి 11 గంటలకు డ్యూటీ ముగించుకుని ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యాడు. బి.కొత్తపల్లి వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వెళ్లిపోయాడు. అదే సమయంలో విధులు ముగించుకుని వస్తున్న తోటి ఉద్యోగులు గమనించి సమచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని బోరున విలపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. కాగా, మరణానంతరం భరత్‌సింహరెడ్డి నేత్రాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. దీంతో మృతుడి నేత్రాలను జీజీహెచ్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి సిబ్బంది సేకరించారు. అనంతరం సాయంత్రం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.