
రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
అనంతపురం ఎడ్యుకేషన్: గత విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చాటిన రజక సామాజిక వర్గానికి విద్యార్థులకు ఆదివారం ‘ప్రతిభా పురస్కారాలు’ అందజేశారు. అనంతపురంలోని కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రజక ఉద్యోగ విద్యావంతుల సంఘం జిల్లా అధ్యక్షుడు సి.ఎర్రిస్వామి అధ్యక్షత వహించారు. రజక కార్పొరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి, న్యాయమూర్తి శివశంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి విద్యార్తి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం 51 మంది పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చాటిన విద్యార్థులకు పురస్కారాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రజక కార్పొరేషన్ డైరెక్టర్లు రామాంజనేయులు, పరమేష్, రజక సంఘం నాయకులు శ్రీరాములు, కృష్ణమూర్తి, ఆనంద్, బయన్న, నాగరాజు, పద్మావతి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.