
టీచర్ అసభ్య ప్రవర్తనపై విచారణ
వజ్రకరూరు: మండలంలోని చిన్నహోతురు జెడ్పీహెచ్‌ఎస్ లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సతీష్‌కుమార్ వ్యవహార శైలిపై సోమవారం డీవైఈఓ మల్లారెడ్డి విచారణ చేపట్టారు. మూడు రోజుల క్రితం విద్యార్థినులతో ఆయన అసభ్యంగా మాట్లాడటంతో వారి తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నిలదీసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఎంఈఓ ఎర్రిస్వామి నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. ఈ నేపథ్యంలో సోమవారం డీవైఈఓ మల్లారెడ్డి పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో వేర్వేరుగా విచారణ చేపట్టారు. కాగా, విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన సతీష్‌కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డీవైఈఓ మల్లారెడ్డిని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఉరవకొండ నియోజకవర్గ కన్వీనర్ భీమేష్ కోరారు. ఇదివరకు పనిచేసిన పాఠశాలలో కూడా సతీష్‌కుమార్ వ్యవహార శైలిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు ఉన్నాయని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.