
బీమా.. లేదు ధీమా
పంటల బీమా పథకాలు అన్నదాతకు ధీమా ఇవ్వడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు మేలు జరిగేలా పథకాలకు రూపకల్పన చేయకపోవడం, ప్రీమియం భారం మోపడం వెరసి అన్నదాతకు నష్టం జరుగుతోంది.
ప్రీమియం భారం, ప్రచారలోపం
● పంటల బీమాపై రైతుల అనాసక్తి
● సీజన్ చివరి దశకు చేరుకున్నా 90 వేల మందే బీమా పరిధిలోకి
● గందరగోళంతో లక్షలాది మంది రైతులు ప్రీమియం కట్టలేని దుస్థితి
అనంతపురం అగ్రికల్చర్: బీమా ప్రీమియం చెల్లించడానికి రైతులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. వర్షాలు ముఖం చాటేయడం, పంట రుణాల సమయంలో ప్రీమియం కట్టాలా వద్దా.., ఏ పంటకు ఎంత చెల్లించాలి.. పంట రుణాలు తీసుకోని వారు ఎక్కడ ప్రీమియం చెల్లించాలి.. తదితర వివరాలు తెలియక, అవగాహన కల్పించే వారు లేక రైతులు అవస్థలు పడుతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రైతులపై ఎలాంటి భారం పడకుండా సర్కారే ప్రీమియం చెల్లించి ఈ–క్రాప్ ఆధారంగా పారదర్శకంగా ఫసల్‌బీమా, వాతావరణ బీమా పథకాలు విజయవంతంగా అమలు చేసింది. ఏటా జూలైలోనే పంటల బీమా కింద అర్హత కలిగిన రైతులకు పెద్ద ఎత్తున పరిహారం కూడా అందించింది. 2019–2024 మధ్య కాలంలో అన్నదాతలకు ఉచిత పంటల బీమా పథకాలు చాలా మేలు చేశాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో నాలుగేళ్లలో పంటల బీమా కింద 14.20 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.1,883 కోట్ల పరిహారం దక్కింది. ప్రభుత్వం మారడంతో చివరి ఖరీఫ్ 2023 బీమా పథకం కింద 2024లో సీఎం చంద్రబాబు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టేశారు. కనీసం 2024 ఖరీఫ్ బీమా కింద ఇవ్వాల్సిన పరిహారంపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు పంటల బీమా పథకాలపై ఆశలు వదులుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కావాలనే ఇలా వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉచిత బీమా పథకాన్ని రద్దు చేసి ప్రీమియం కట్టాలంటూ నిబంధన విధించడంతో రైతులకు బీమా పథకాల లబ్ధి అందని ద్రాక్షగానే మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.
ఇప్పటికి 90 వేల మందే..
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి బీమా పథకాలకు ప్రీమియం చెల్లింపు గడువు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికి 90 వేల మంది రైతులు మాత్రమే ప్రీమియం చెల్లించి బీమా పరిధిలోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఇంకా రెండు లక్షల మంది పైచిలుకు రైతులు బీమాకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఖరీఫ్‌లో పంట దిగుబడుల ఆధారంగా ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద కంది, వరి, జొన్న, మొక్కజొన్న, ఆముదం, ఎండుమిరపకు బీమా పథకం వర్తింపజేశారు. ఇందులో కంది రైతులు ఎకరాకు రూ. 80 ప్రకారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వరి రైతులు రూ.164, జొన్న రూ.84, మొక్కజొన్న రూ.132, ఆముదం రూ.80, ఎండుమిరప రూ.576 ప్రకారం ఈ నెలాఖరులోగా ప్రీమియం చెల్లించాలి. ఇక వాతావరణ బీమా పథకం వేరుశనగ, పత్తి, దానిమ్మ, బత్తాయి, టమాట, అరటికి వర్తింపజేశారు. ఇందులో వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం ప్రీమియం కట్టాలి. పత్తి రూ.1,140, దానిమ్మ రూ.3,750, చీనీ, బత్తాయి రూ.2,750, టమాట రూ.1,600, అరటి రూ.3 వేల ప్రకారం ఈనెల 15 వరకూ ప్రీమియం వసూలు చేశారు. అయితే, గడువు పొడిగించాలంటూ ప్రతిపాదనలు పంపినా అనుమతులు రాలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. పంటల బీమా పథకాల స్థితిగతుల గురించి అటు కూటమి సర్కారు, ఇటు వ్యవసాయశాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది.