
వ్యాపారిపై చర్యలు తీసుకోండి
● రూ.23 లక్షలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడు
అనంతపురం అర్బన్: పంట కొనుగోలుకు సంబంధించి డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న వ్యాపారిపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు రైతులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ... కణేకల్లు మండలం పులిచెర్ల, నాగిరెడ్డిపల్లి, కె.కొత్తపల్లి, పామిడి మండలం ఎద్దులపల్లి, పెద్దవడుగూరు మండలం మేడిమాకులపల్లి రైతులకు మొక్కజొన్న, సజ్జ విత్తనాభివృద్ది కోసం సత్య అగ్రిటెక్ ద్వారా వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వ్యాపారి వెంకట్రామిరెడ్డి విత్తనాలు ఇప్పించాడన్నారు. దిగుబడి మొత్తం తానే కొనుగోలు చేసి, పంట తరలించే సమయంలో కొంత సొమ్ము ఇప్పించాడని తెలిపారు. మిగిలిన సొమ్ము రూ.23,18,600 చెల్లించకుండా నాలుగు నెలలుగా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్నారు. అధికారులు ఆ వ్యాపారిపై చర్యలు తీసుకుని రైతులకు డబ్బు ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ శివ్‌నారాయణ్ శర్మను కలసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు అనుమేష్, శ్రీను, చిన్నతిప్పేస్వామి, శ్రీనివాసులు, రామాంజనేయులు, రుద్రయ్య, నాగేష్, నాగరాజు, జయరామిరెడ్డి ఉన్నారు.
26 నుంచి
‘హనుమాన్ దర్శన్’
● ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు
అనంతపురం క్రైం: శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని జిల్లాలోని మురడి, నేమకల్లు, కసాపురం గ్రామాల్లో వెలసిన ఆంజనేయస్వామి ఆలయాలను ఒకే రోజు సందర్శించుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ఆర్‌ఎం సుమంత్.ఆర్.ఆదోని సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 26 నుంచి ప్రతి శని, మంగళవారాల్లో హనుమాన్ దర్శన్ పేరుతో అనంతపురం, గుత్తి, గుంతకల్లు, కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, ఉరవకొండ డిపోల నుంచి ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఈ నెల 26, 29, ఆగస్టు 2, 5, 9, 12, 16, 19 బస్సులు బయలుదేరుతాయి. రద్దీకి అనుగుణంగా 50 మంది ఒకే బ్యాచ్‌గా ప్రయాణించాలనుకుంటే వారి ప్రాంతానికే ప్రత్యేకంగా బస్సును పంపిస్తారు.