
‘కేజీబీవీ’ అరబిక్ టీచర్ల్లకు షాక్
అనంతపురం ఎడ్యుకేషన్: మైనార్టీ కేజీబీవీల్లో పదేళ్లుగా అరబిక్ టీచర్లు (ఇన్‌స్ట్రక్టర్లు)గా పని చేస్తున్న వారికి కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈసారి వారిని తీసుకోవద్దంటూ ఉన్నతాధికారుల నుంచి కేజీబీవీలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకుండా మౌఖిక ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది. దీంతో బాధిత టీచర్లు సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి గ్రీవెన్స్‌లో ఇన్‌చార్జ్ కలెక్టర్‌ను కలిసి గోడు వెల్లబోసుకున్నారు.
తక్కువ వేతనంతో పని చేస్తున్న ఇన్‌స్ట్రక్టర్లు
ఉమ్మడి జిల్లాలోని ఆరు మైనార్టీ కేజీబీవీల్లో అరబిక్ ఇన్‌స్ట్రక్లర్లు పనిచేస్తున్నారు. వీరు రోజూ ఒక పిరియడ్ మాత్రమే బోధిస్తారు. నెలకు వీరికి రూ. 4 వేలు చొప్పున అతి తక్కువ వేతనాన్ని ప్రభుత్వం చెల్లిస్తోంది. అయినా ఏళ్ల తరబడి చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లాలోని కురుగుంట, తాడిపత్రి, గుంతకల్లు కేజీబీవీల్లో వీరు పని చేస్తున్న వారిని ఈసారి రెన్యూవల్ చేయలేదు. సేవాభావంతో పని చేస్తున్న తమను ఇలా అర్ధంతరంగా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా రావద్దని చెప్పడం అన్యాయమని బాధిత ఇన్‌స్ట్రకర్లు గౌసియా బేగం, ఫర్హాన, అఫ్రోజ్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కె.విజయ్ మాట్లాడుతూ... కేజీబీవీల్లో పదేళ్లుగా పని చేస్తున్న అరబిక్ టీచర్లను ఈసారి తొలిగించడం అన్యాయం అన్నారు. కాగా దీనిపై జీసీడీఓ కవిత ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రాష్ట్ర కార్యాలయం నుంచి మౌఖిక ఆదేశాలు అందాయని ఈ క్రమంలో వారిని తొలిగించామంటున్నారు.