
బండి కాదు.. మొండి!
గుంతకల్లు: రైలు ప్రయాణం ఎంతో ఆనందాన్ని, అనుభూతిని కలిగిస్తుంది. రైలు ప్రయాణం అనేది కేవలం గమ్యస్థానానికి చేరుకునే మార్గం మాత్రమే కాదు, ప్రయాణంలోనే ఒక గొప్ప అనుభూతిని మిగులుస్తుంది. రైలు ప్రయాణంలో ప్రకృతి అందాలను దగ్గరగా చూడవచ్చు. పచ్చని పొలాలు, కొండలు, నదులు, అడవులు వంటివి మన కళ్లకు కనువిందు చేస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులతో కలిసి ప్రయాణించే అవకాశం ఉంటుంది. వారి అనుభవాలను పంచుకోవడం, కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడం వంటివి రైలు ప్రయాణంలో సాధ్యమవుతాయి. రైలు ప్రయాణం సాధారణంగా సౌకర్యవంతంగా ఉంటుంది. బెర్తులు, భోజన సదుపాయాలు వంటివి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయి.
బాబోయ్ ఆ రైలు ప్రయాణమా?
వైద్యం కోసం నిత్యం ఎందురో రోగులు గుంతకల్లు, పరిసర ప్రాంతాల నుంచి కర్నూలు, హైదరాబాద్‌కు ఉదయాన్నే కాచిగూడ ప్యాసింజర్ రైలులో వెళ్తుంటారు. అలాగే ఉద్యోగ, విద్యా నిమిత్తం కర్నూలు, హైదరాబాదు వెళ్లే వారికి కూడా ఈ రైలు ఎంతో ఉపయోగకరం. తిరుగు ప్రయాణంలో ఈ రైలుకే వస్తుంటారు. ఎందుకంటే ఈ ప్యాసింజర్ బండికి చాలా తక్కువ చార్జీ. బస్సు చార్జీలు భరించలేని చాలా మంది ఈ రైలులోనే ప్రయాణిస్తుంటారు. అయితే ఈ రైలు ప్రయాణమంటే ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. రైలు ప్రయాణికుల సహనానికి, శాంతికి పెనుసవాలుగా మారిన ఈ ప్యాసింజర్ రైలుకు వారు పెట్టుకున్న ముద్దు పేరు ‘దయ్యాల బండి’. ఎందుకంటే దయ్యాలు సంచరిస్తాయని భావించే అర్థరాత్రి వేళ ఈ ప్యాసింజర్ రైలు గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారమైతే ఈ ప్యాసింజర్ బండి సాయంత్రం 7.30 గంటలకు గుంతకల్లుకు చేరుకోవాలి. కానీ ఈ రైలు చరిత్రలో ఏనాడూ సరైన సమయానికి గమ్యస్థానం చేరింది లేదు.
12 కి.మీల ప్రయాణానికి రెండు గంటలపైగా..
కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 11.00 గంటలకు బయలుదేరిన ఈ ప్యాసింజర్ (57412) రైలు సాయంత్రం 7.30 గంటలకు గుంతకల్లు చేరుకోవాలి. 46 రైల్వేస్టేషన్లు దాటుకుని 47వ రైల్వేస్టేషన్ కర్నూలు జిల్లాలోని మద్దికెర చేరుకునేంత వరకూ ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. మద్దికెర స్టేషన్‌కు చేరుకోగానే తన విశ్వ రూపాన్ని చూపుతుంది. మద్దికెర రైల్వేస్టేషన్ నుంచి గుంతకల్లు రైల్వే జంక్షన్ మధ్య దూరం 12 కిలోమీటర్లు ప్రయాణించేందుకు రెండు, మూడు గంటల సమయం తీసుకుంటుంది. ఇక మద్దికెర రైల్వేస్టేషన్‌లో కనీసం గంటపాటు నిలిపి వేస్తారు. తర్వాత వచ్చే చిన్న స్టేషన్ మల్లపగేట్ వద్ద మరో గంట ఆగిపోతుంది. ఇక గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు మరో రెండు నిమిషాల్లో చేరుకుంటాం అనుకునే తరుణంలో ఔటర్‌లో డీఆర్‌ఎం కార్యాలయం వద్ద మరో గంటసేపు నిలిచిపోతుంది. అయితే ఇన్ని గంటల పాటు ఈ రైలును నిలపడానికి కారణాలు ఏమిటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
మధ్యలోనే దిగిపోతారు..
రోజూ చిమ్మ చీకట్లో గంటల తరబడి ఊర్ల బయట ఈ రైలు నిలిచిపోయి ప్రయాణికులను బెంబేలెత్తిస్తుంది. ఈ రైలులో ఎలాంటి పోలీసు భద్రత ఉండదు. దీంతో మహిళా ప్రయాణికులు భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తుంటారు. చాలా మంది ప్రయాణికులు ఈ రైలు పరిస్థితి తెలుసుకుని మద్దికెరలోనే దిగి ఆటోల్లో గుంతకల్లుకు చేరుకుంటారు. మరికొందరు గత్యంతరం లేక అలాగే గుంతకల్లు వరకూ ప్రయాణిస్తారు. డీఆర్‌ఎం కార్యాలయం సమీపంలోని బ్రిడ్జి వద్ద బండి నిలబడగానే బోగీలు దిగి కంకరపై లగేజ్ బ్యాగులు మోసుకుంటూ వెళ్లిపోతుంటారు. ఈ బాధలు తెలిసి కూడ రైల్వే అధికారులు ఈ ప్యాసింజర్ బండిని సమయానికి గుంతకల్లు స్టేషన్‌కు చేర్చడంలో విఫలమతున్నారు.
12 కి.మీ. ప్రయాణానికి
రెండు గంటలకు పైగా సమయం
గంటల తరబడి రైల్వేస్టేషన్ సమీపంలో నిలుపుదల
ఈ రైలులో ప్రయాణామంటే చిర్రెత్తిపోతున్న ప్రయాణికులు