
మృత్యువులోనూ వీడని బంధం
శింగనమల: సొంతూరిలో బంధువులు అనారోగ్యంతో ఉంటే పరామర్శించడానికి భార్యాభర్త తాడిపత్రి నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. అయితే.. మార్గమధ్యంలో ప్రమాదానికి గురయ్యారు. భర్త సంఘటన స్థలంలోనే మృతి చెందగా.. భార్యను 108 వాహనంలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా కన్నుమూసింది. ఈ విషాదకర ఘటన ఆదివారం శింగనమల మరువకొమ్మ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. ఎస్‌ఐ విజయకుమార్ తెలిపిన మేరకు... శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రఘునాథరెడ్డి (61), సావిత్రమ్మ (59) దంపతులు దాదాపు 19 ఏళ్ల క్రితం తాడిపత్రికి వలస వెళ్లారు. అక్కడే వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఒకరికి వివాహం కాగా, మరొకరికి ఇంకా కాలేదు. వీరికి సొంతూరు గుమ్మేపల్లిలో భూములు, ఇల్లు ఉన్నాయి. సొంతూరిలో బంధువులు అనారోగ్యంతో ఉండడంతో పరామర్శించడానికి భార్యాభర్త ఆదివారం కొత్తగా కొన్న ద్విచక్రవాహనంపై తాడిపత్రి నుంచి బయలుదేరారు. మార్గమధ్యంలో శివపురం పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. కొద్ది దూరంలోని శింగనమల మరువకొమ్మ క్రాస్ వద్దకు చేరుకుని..కొత్తగా నిర్మించిన 554–డీ రోడ్డులో శింగనమల వైపు క్రాస్ అవుతుండగా వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రఘునాథరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కాలు పూర్తిగా తెగిపోయింది. తీవ్ర గాయాలపాలైన సావిత్రమ్మను 108 వాహనంలో చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందింది. దంపతుల మృతితో ఇటు గుమ్మేపల్లి, అటు తాడిపత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం సాయంత్రం గుమ్మేపల్లిలో దంపతుల అంత్యక్రియలు నిర్వహించారు. భార్యాభర్త ఎంతో మంచి వారని, గ్రామానికి వచ్చినప్పుడు అందరినీ ఆప్యాయంగా పలకరించే వారని స్థానికులు గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
అండర్ బ్రిడ్జి లేకపోవడంతోనే ...
అనంతపురం–తాడిపత్రి మార్గంలో జాతీయ రహదారి 554–డీ నిర్మాణంలో భాగంగా నియోజకవర్గ కేంద్రమైన శింగనమలకు అండర్ వే బ్రిడ్జి నిర్మించలేదు. దీంతో తాడిపత్రి నుంచి వచ్చే వారు శింగనమలలోకి రావాలంటే రోడ్డు క్రాస్ చేయాలి. శింగనమల నుంచి అనంతపురానికి వెళ్లాలన్నా ఇదే పరిస్థితి. దీంతో మరువకొమ్మ క్రాస్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నా.. అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
రోడ్డు ప్రమాదంలో
దంపతుల దుర్మరణం
మరువకొమ్మ క్రాస్ వద్ద ఘటన
గుమ్మేపల్లిలో విషాదం

మృత్యువులోనూ వీడని బంధం

మృత్యువులోనూ వీడని బంధం