
కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం
పెద్దవడుగూరు: ‘తెల్లబంగారం’ కన్నీళ్లు పెట్టిస్తోంది. పెద్దవడుగూరు మండలంలోని పలు గ్రామాల్లో జూన్ మొదటి వారంలో కురిసిన తొలకరి జల్లులు రైతుల్లో ఆశలు రేపాయి. పంటల సాగుకు అన్నదాతలు ఉత్సాహంగా ముందుకు సాగారు.మండలంలోని ఆవులాంపల్లి, విరుపాపురం, పెద్దవడుగూరు, లక్ష్ముంపల్లి, చిన్నవడుగూరు, దిమ్మగుడి, చిత్రచేడు తదితర గ్రామాల్లో 3,004 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. అయితే, మొదట్లో ఆశలు రేపిన వరుణుడు.. పంటలు సాగు చేశాక ముఖం చాటేశాడు. అన్నదాతలు కళ్లకు కాయేలా ఆకాశం వైపు చూస్తున్నా కరుణ చూపడం లేదు. ఈ క్రమంలో పత్తి మొక్కలు ఎదుగుదల లేక ఎండుముఖం పట్టాయి. చేసేదేమీ లేక రైతులు తమ పొలాల్లోని పత్తి పంటను తొలగిస్తున్నారు. ఇటీవల ఆవులాంపల్లిలో ఈశ్వరరెడ్డి తన పొలంలో పత్తి పంటను ట్రాక్టర్‌తో దున్నేశాడు. ఆదివారం లక్ష్ముంపల్లికి చెందిన పుల్లారెడ్డి కూడా పంటను తొలగించాడు.ఎకరా పొలంలో పత్తి పంట సాగు చేయాలంటే రూ. 30 వేల దాకా ఖర్చవుతుంది. కూటమి ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ సాయం అందించకపోవడంతో బయట అప్పులు చేసి మరీ పంటలు పెట్టారు. ఇంత చేసినా దురదృష్టం వెంటాడడం గమనార్హం. అప్పులపాలయ్యామని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
వర్షాభావంతో అల్లాడిపోతున్న రైతులు
చేసేది లేక పంట తొలగింపు
ప్రభుత్వాలు ఆదుకోవాలి
4 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశా. సుమారు రూ. లక్షకు పైగా ఖర్చయింది. వర్షాలు లేకపోవడంతో పంట ఎదుగుదల లేదు. రైతులు ఎప్పుడూ కష్టాల్లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు ఆదుకోవాలి.
– నరసింహులు, రైతు లక్ష్ముంపల్లి,
పెద్దవడుగూరు మండలం
ఉన్నతాధికారులకు వివరిస్తాం
గ్రామాల్లో రైతులు వ్యవసాయ శాఖ సిబ్బందికి పంటల సాగు వివరాలు తెలియజేయాలి. పత్తి రైతుల కష్టాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వానికి నివేదిక పంపి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం –మునికృష్ణ, ఏఓ, పెద్దవడుగూరు

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం