
సత్యసాయి బోధనల ఆచరణతో స్వీయ పరివర్తన
ప్రశాంతి నిలయం: సత్యసాయి బోధనలు ఆచరించడం ద్వారా ప్రతి ఒక్కరూ స్వీయపరివర్తనతో పరిపూర్ణులు అవుతారని వక్తలు పేర్కొన్నారు. ‘స్వీయ పరివర్తన కోసం యువత నాయకత్వం’ పేరిట రెండు రోజులుగా ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సదస్సు ఆదివారం ముగిసింది. సాయంత్రం సత్యసాయి మహాసమాధి చెంత గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించారు. వేదపఠనంతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 18 దేశాలకు చెందిన యువతీ యవకులు పాల్గొన్నారు. యువతలో స్వీయ పరివర్తన కోసం సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన కోర్సును పూర్తి చేసుకున్న యువ నాయకులు మలేషియాకు చెందిన విమల్ రాజ్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన రిషా తదితరులు ప్రసంగించారు. సత్యసాయి బోధించిన సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలను ఆచరించడం ద్వారా మహనీయులుగా మారుతారన్నారు. అనంతరం యువత సంగీత కచేరీ నిర్వహించారు. తర్వాత సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యుడు చక్రవర్తిలు కోర్సు పూర్తి చేసుకున్న యువతకు సరిఫికెట్‌లు ప్రదానం చేశారు.