
40 శాతం లోటు..
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాయితీ విత్తన వేరుశనగ పంపిణీ ఈ సారి కేవలం 46,675 క్వింటాళ్లకు పరిమితమైంది. దీనికితోడు పంపిణీ ప్రక్రియను కూటమి సర్కారు ఆలస్యం చేయడం, విత్తన సేకరణ, సరఫరా జాప్యం కావడంతో రాయితీ విత్తనంపై రైతులు నమ్మకం వదిలేసుకున్నారు. ఈ క్రమంలో సాగు విస్తీర్ణం పూర్తిగా తగ్గిపోయింది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 3,39,716 హెక్టార్లు కాగా ప్రస్తుతం ప్రధాన పంటల సాగు విస్తీర్ణం 65 వేల హెక్టార్లు నమోదైంది. 23 వేల హెక్టార్లలో వేరుశనగ, 21 వేల హెక్టార్లలో కంది, 9 వేల హెక్టార్లలో పత్తి, 6,800 హెక్టార్లలో మొక్కజొన్న, 3,300 హెక్టార్లలో ఆముదం, వెయ్యి హెక్టార్లలో సజ్జ పంట సాగులోకి వచ్చినట్లు వ్యవసాయశాఖ నివేదికలు చెబుతున్నాయి. ప్రధాన పంటలు విత్తుకునే సమయం చివరి దశకు చేరుకున్నా.. 20 శాతం మాత్రమే సాగులోకి రావడం గమనార్హం. రెండు మూడు రోజులుగా అక్కడక్కడా కురుస్తున్న వర్షాలకు 1.50 లక్షల హెక్టార్ల వరకు ప్రధాన పంటలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రత్యామ్నాయంపై దృష్టి..
మృగశిర, ఆరుద్ర, పునర్వసు తదితర విత్తన కార్తెలు ముగుస్తున్నా సరైన పదును వర్షం లేక సాగు చతికిలపడింది. ఆదివారం చివరి విత్తన కార్తె పుష్యమి మొదలు కానుంది. అంటే నెలాఖరు వరకు ప్రధాన పంటల సాగుకు సమయముంది. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ, కంది, పత్తి, ఆముదం లాంటివి విత్తుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు ‘ప్రత్యామ్నాయం’పై దృష్టి సారించారు. ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రత్యామ్నాయం కింద ఉలవ, పెసర, అలసంద, కొర్ర లాంటి విత్తనాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడానికి క్షేత్రస్థాయి నివేదికలు తీసుకుంటున్నారు. 1.50 లక్షల హెక్టార్లకు ప్రత్యామ్నాయ విత్తన ప్రణాళిక సిద్ధం చేయడానికి వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
రైతుల అనాసక్తి..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది జిల్లాకు కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే కేటాయించారు. ఎట్టకేలకు అందులో 46,675 క్వింటాళ్లు పంపిణీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. రాయదుర్గం, గుత్తి, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, డి.హీరేహాళ్, గుమ్మఘట్ట మండలాల్లో మాత్రమే విత్తన పంపిణీ కొంచెం మెరుగ్గా ఉంది. తాడిపత్రి డివిజన్ పరిధిలో అయితే నార్పలలో 1,400 క్వింటాళ్లు పంపిణీ చేయగా... పెద్దపప్పూరు, తాడిపత్రి, పుట్లూరు, యల్లనూరు మండలాల్లో ఒక్క క్వింటాలు కూడా పంపిణీ చేయలేదు. మిగతా మండలాల్లో మోస్తరుగా జరిగింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా రాయితీ విత్తన వేరుశనగ తీసుకునేందుకు రైతులు అనాసక్తి ప్రదర్శించారు.
నిర్లక్ష్య కాటు.. శెనిక్కాయకు పోటు
విత్తన వేరుశనగ పంపిణీలో కూటమి అలసత్వం
రాయితీ విత్తనం 46,675
క్వింటాళ్లకు పరిమితం చేసిన వైనం
సాగుపై తీవ్ర ప్రభావం
వరుణుడి కరుణా లేక తగ్గిన పంట విస్తీర్ణం
జూన్, జూలైకు సంబంధింఽచి 35 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు 104.2 మి.మీ గానూ 66.9 మి.మీ నమోదైంది. జూన్‌లో ఓ మోస్తరుగా అక్కడక్కడా కురిసిన తేలికపాటి వర్షాల వల్ల ఈ మాత్రం నమోదు కావడం విశేషం. మూడు మినహా తక్కిన 29 మండలాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షాలు కురిశాయి.