కొండకర్ల ఆవ సాక్షిగా అందలాపల్లి కొండ విధ్వంసం
అడ్డగోలుగా క్వారీ అనుమతులు
అనుమతిచ్చిన చోట కాకుండా పక్కన బండరాళ్ల పెకిలింపు
గ్రావెల్ కోసం ఇచ్చిన క్వారీ పక్కదారి
అయినా అధికారులు మౌనవ్రతం..?
అభివృద్ధికి ఆవల..
సాక్షి, అనకాపల్లి : అభివృద్ధిని బూచిగా చూపి క్వారీ లీజులివ్వడంలో మైనింగ్ శాఖ అధికారులు అందెవేసిన చేయిగా మారారు. భవిష్యత్ తరాలకు చుక్కానిలా నిలిచే వనరుల్ని సద్వినియోగం చెయ్యడం, వాటికి భద్రత కల్పించడం అధికారుల బాధ్యత. కానీ అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు చోద్యం చూస్తున్నాయి. చివరకు విజిలెన్స్ బృందం సైతం క్వారీ తవ్వకాల్లో లోపాలు కనపించాయని చెప్పినా చేతులు దులుపుకొని క్వారీ కార్యకలాపాలను నిర్వహించడం అనకాపల్లి జిల్లాలోనే సాధ్యమైందని చెప్పొచ్చు. వివరాల్లోకి వెళితే...
అనకాపల్లి–అచ్యుతాపురం రహదారి విస్తరణ పనుల్ని ఒక ప్రైవేట్ సంస్థ చేపడుతోంది. నిర్వాసితులకు నష్టపరిహారం అందించడంతో పాటు, అలైన్‌మెంట్ మార్పులు, రహదారి పనులకు అవసరమైన మైనింగ్ నిక్షేపాలు లభించడంలో ఏర్పడిన ప్రతిష్టంభనను సాంకేతికంగా అధిగమించాల్సిన నిర్మాణ సంస్థ అధికారుల సాయంతో సహజ వనరుల దోపిడీకి పాల్పడుతోంది. నిస్సిగ్గుగా సాగుతున్న ఈ తతంగం సాక్షిగా ఆయా గ్రామాల ప్రజలు పాలకుల బెదిరింపులతో తెల్లముఖం వెయ్యడం తప్ప అడ్డుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు.
అనుమతులు ఇవ్వడమే తప్పిదం..!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని అందలాపల్లి కొండకు విశిష్టత ఉంది.సమీపంలో ఉన్న కొండకర్ల ఆవలో విడిది చేసే పక్షులకు రాత్రి వేళ ఆవాసంగా అందలాపల్లి కొండపై భాగాన ఉన్న వృక్షాలు ఉపయోగపడతాయి. దీనికి తోడు ఈ ఆవ సరిహాద్దుల్లో ఎకోటూరిజం మేరకు చిత్తడి నేలల పరిరక్షణ కమిటీలను కూడా గతంలో నియమించాలని, దీంట్లో స్థానికుల భాగస్వామ్యం తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న అందలాపల్లి కొండపై పర్యావరణ అనుమతులు లేకుండా ఎటువంటి తవ్వకాలు చేపట్టరాదు. పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు గతంలో ఉన్న జటిలమైన నిబంధనల్ని తూతూ మంత్రంగా మార్చిన ఇప్పటి ప్రభుత్వం స్థానిక పంచాయతీ పాలక వర్గం సమ్మతి లేకుండానే ఎన్‌ఓసీని జారీ చేశారు. ఈ క్రమంలో గతంలో ఇక్కడి క్వారీ ప్రాంతం వద్ద స్థానికులు నిరసన తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అనుమతులు ఒక చోట... తవ్వకాలు మరో చోట
అందలాపల్లి కొండ శిఖర భాగాన క్వారీకి అడ్డగోలుగా అనుమతి ఇచ్చారు. అది కూడా లూజ్ సాయిల్‌ను తవ్వుకొని రహదారి లెవెలింగ్‌కు ఉపయోగించుకోవాలనేది అడ్డగోలు అనుమతి సారాంశం. కానీ ఇక్కడ గ్రావెల్ అనేది లేదు. దీంతో పెద్ద పెద్ద బండరాళ్లను డ్రిల్లింగ్ చేసి మరీ పెకిలిస్తున్నారు. అనుమతుల్లో ఉన్న సర్వే నంబర్ కాకుండా పక్కన పూర్తిగా కొండను ధ్వంసం చేశారు. దీనికి పెద్ద పెద్ద సంస్థలు, ఆయా ప్రతినిధుల ఒత్తిడి ఉండడంతో ఇక్కడేం జరగనట్లు మైనింగ్ శాఖ మిన్నకుంటున్నది.
తూతూ మంత్రంగా విజిలెన్స్...
ఈ క్వారీపై గతంలో విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసిన స్థానికులు సైతం ఆ విభాగ తీరును ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు వచ్చి నామ మాత్రపు నివేదికతో కూడిన సంతకాలు తీసుకొని వదిలేశారు. దీంతో అక్రమ క్వారీ ద్వారా వచ్చిన బండరాళ్లను అచ్యుతాపురం–అనకాపల్లి రహదారి విస్తరణ పనుల లెవెలింగ్ పనులు దర్శనమిస్తున్నాయి. క్వారీ ఎక్కడ అనుమతి ఇచ్చారో, ఎక్కడి నుంచి మెటల్ తవ్వుతున్నారో క్షేత్ర స్థాయి పరిశీలన జరపని మైనింగ్ అధికారుల ఉదాసీన వైఖరి కారణంగా పొంతన లేని సీనరేజ్ వసూలు బిల్లుల్ని పట్టుకొని క్వారీ వాహనదారులు దర్జాగా అందలాపల్లి కొండను తొలిచేస్తున్నారు. ఈ కొండ పూర్తిగా కరిగిపోతే ఈ ప్రాంతానికి వరంగా ఉన్న పర్యాటక అందాలు కనుమరుగవ్వడం ఖాయమని స్థానికులు వాపోతున్నారు.


