పెబుత్వం మాది..
మాకే ఓటేయాలంటన్నారు..
సోమవారం రాత్రి టీడీపీ నాయకులు మా ఇంటికి వచ్చేరు. మీ భర్త ఎవరికి ఓటేస్తారని అడిగారు. వైఎస్సార్‌సీపీ నిలబెట్టిన కాశీకి ఓటేస్తామని చెబితే చెంపమీద కొడుతూ ఎలా వేస్తావు.. కూటమి పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయకపోతే మీకు మంజూరు చేసిన సీఎం రిలీఫ్ ఫండ్ వెనక్కి ఇచ్చేయాల్సిందే అని బెదిరించారు. పెబుత్వం మాది మాకే ఓటేయాలి. వేయకపోతే ఊరుకోము అంటూ బెదిరించారు. ఇదెక్కడి న్యాయం..
– బోంది చినతల్లి, రాజయ్యపేట
నా ఓటు నా యిష్టం...
మా ఓటు మా ఇష్ట ప్రకారం వేసుకోడానికి అవ్వదా. మేము వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి ఓటేస్తామని చెబితే ఎందుకు వేస్తారు, అని బెదిరిస్తున్నారు. ఒకరికి మాట ఇచ్చేసాం. మీ రాజకీయ నాయకుల్లా డబ్బులు తీసుకుని మాట మార్చము. మాకు నచ్చినట్లు ఓటేసుకుంటామంటే కుదరదు మా పార్టీకే వేయాలి అని బెదిరిస్తున్నారు. పెబుత్వం మాది మేము చెప్పినోళ్లకే ఓటేయాలి అంటున్నారు. ఇదెక్కడి న్యాయం. నా ఓటు నాకు నచ్చినోడికే వేస్తాను.
–యజ్జల సత్తిబాబు, రాజయ్యపేట
నక్కపల్లి : నక్కపల్లి, పాయకరావుపేట మండలాల్లోని 7 గ్రామాల్లో మైరెన్ ఫిషరమెన్ కో ఆపరేటివ్ సొసైటీలకు మంగళవారం ఎన్నికలు జరగనున్నాయి. ప్రత్యక్ష పద్ధతిలో చేతులు ఎత్తే విధానం ద్వారా సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులను, ఇతర డైరెక్టర్లను ఎన్నుకుంటారు. పాయకరావుపేట నియోజకవర్గంలో 17 మత్య్సకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 30 వేల మందికి పైగా మత్స్యకారులు నివసిస్తున్నారు. 7వేల మందికి పైగా మత్స్యకారులు బోట్లు, తెప్పలు, ఇంజను కలిగిన బోట్లపై వేట సాగిస్తుంటారు. ప్రస్తుతం 7 ఫిషర్‌మెన్ సొసైటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3374 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నక్కపల్లి మండలంలో రాజయ్యపేట (887 మంది సభ్యులు), బోయపాడు(635 మంది సభ్యులు), పెదతీనార్లలో (558 మంది), చినతీనార్ల (165 మంది), దొండవాక(278మంది), బంగారయ్యపేటలో (461మంది) సభ్యులు ఉన్నారు. పాయకరావుపేట మండలం పెంటకోటలో (360 మంది) తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు
మంగళవారం ఉదయం ఎన్నికల నిర్వహణకు మత్స్యశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు అయినప్పటికీ సొసైటీ ప్రెసిడెంట్‌గా బరిలో నిలిచిన అభ్యర్థికి ఏదో ఒక పార్టీ మద్దతు ఉంటుంది. దీంతో ఇరు పార్టీలకు చెందిన గ్రామ స్థాయి నాయకులు తమ మద్దతుదారు విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇక్కడ ఓట్లు కలిగిన వారిలో చాలా మంది వేటరీత్యా పూరి, పరదీప్, భువనేశ్వర్, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. బరిలో నిలిచిన అభ్యర్థులు ఆయా ప్రాంతాలకు వెళ్లి వీరందరిని కలిసి తమను గెలిపించాలని అభ్యర్థించడంతో పాటు రానుపోను దారి ఖర్చులు కూడా భరిస్తున్నారు. సొసైటీ ద్వారా ప్రభుత్వం మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పఽథకాలు అమలు చేస్తుంది. సబ్సిడీతో కూడిన ఇంజిన్లు, వలలు, బోట్లు, ఇతర వేట సామగ్రితో పాటు, పింఛన్లు, సబ్సిడీపై డీజిల్ వంటి సదుపాయాలు కల్పించడంతో ఈ సొసైటీ ప్రెసిడెంట్ పదవులకు తీవ్ర పోటీ ఏర్పడింది. ఎన్నికల సందర్భంగా ఘర్షణలు తలెత్తకుండా డీఎస్పీ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. డివిజన్‌లో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే అన్ని గ్రామాల్లోను డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ మురళి, ఎస్‌ఐ సన్నిబాబు పర్యటించారు.
కూటమి ప్రలోభాలు.. బెదిరింపులు
వైఎస్సార్‌సీపీ బలపరచిన అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా ఉండడంతో కూటమి పార్టీల నాయకులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారు. తాము మద్దతు ఇచ్చిన వారికి ఓటు వేయకపోతే రేషన్ కార్డులు నిలిపివేస్తాం, పింఛన్లు రద్దు చేస్తాం, ఇళ్ల స్థలాలు రాకుండా చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా పెంటకోట, పెదతీనార్ల గ్రామాల్లో తమ పార్టీ బలపరచిన అభ్యర్థులు ఓడిపోతారనే భయంతో కూటమి నాయకులు ఈ రెండు సొసైటీ ఎన్నికలను వాయిదా వేయించే ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజయ్యపేటలో మత్స్యకార సొసైటీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ పోలీసులను కోరారు. కూటమి నాయకులు ఓటమి భయంతో ఎన్నికల్లో గలాటా సృష్టించి వాయిదా వేయాలని చూస్తున్నారన్నారు. తక్షణమే భారీ బందోబస్తు ఏర్పాటు చేసి స్వేచ్చగా ఓటు వేసుకునే ఆవకాశం కల్పించాలని కోరారు.


