కాళ్లరిగేలా తిరిగినా.. కానరాని పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

కాళ్లరిగేలా తిరిగినా.. కానరాని పరిష్కారం

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

పదేపదే వినతులిస్తున్నా పట్టించుకోని అధికారులు

పీజీఆర్‌ఎస్‌ అర్జీలు బుట్టదాఖలు

వ్యయప్రయాసలే తప్ప ప్రయోజనం శూన్యం

వాపోతున్న ప్రజలు

తుమ్మపాల: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన వినతుల పరిష్కారంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో ప్రతి సోమవారం అర్జీదారులు కలెక్టరేట్‌ చుట్టూ తిరగవలసి వస్తోంది. వ్యయప్రయాసలకోర్చి వచ్చి ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితి లేదని పలువురు వాపోతున్నారు. కలెక్టరేట్‌లో స్వీకరిస్తున్న అర్జీల్లో పునరావృతమైనవే ఎక్కువగా ఉంటున్నాయి. జిల్లాలో అన్ని శాఖల్లోనూ పునరావృత అర్జీలు నమోదవడం ఆయా శాఖల పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది.

ముఖ్యంగా రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలే అత్యధికంగా నమోదవుతున్నాయి. భూ సర్వే, పంచాయతీరాజ్‌, పోలీస్‌ శాఖలకు సంబంధించిన అర్జీల సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. గతంలో కొన్ని శాఖలకు మాత్రమే పరిమితమైన అర్జీలు ఇటీవల అన్ని శాఖల్లోనూ అధికంగా నమోదవుతున్నాయి. ఆయా శాఖల పరిధిలో ప్రజలకు క్షేత్రస్థాయిలో అందాల్సిన సేవలు సక్రమంగా అందకపోవడం, సమస్యలు స్థానికంగానే పరిష్కారం కాకపోవడంతోనే ప్రజలు కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున వచ్చి అర్జీలు అందజేస్తున్నారు.

పీజీఆర్‌ఎస్‌లో అర్జీ నమోదు చేసిన తర్వాత సమస్య పరిష్కారంపై అధికారులు దృష్టి సారించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం అర్జీదారులకు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకునేందుకే పరిమితమవుతున్నారని, అనంతరం అర్జీని పరిష్కరించినట్లు నమోదు చేస్తున్నారని పలువురు అర్జీదారులు వాపోతున్నారు. జిల్లా అధికారుల వద్ద మొరపెట్టుకుంటున్నా పరిష్కారం చూపడం లేదని సోమవారం కలెక్టరేట్‌ వద్ద జరిగిన పీజీఆర్‌ఎస్‌లో పలువురు అసహనం వ్యక్తం చేశారు. మొత్తం 302 అర్జీలు నమోదు కాగా అత్యధికంగా పునరావృతమైనవే ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 176, సర్వే విభాగం 22, పంచాయతీరాజ్‌ 18, పోలీస్‌ 11, మిగిలినవి వివిధ శాఖలకు సంబంధించినవి ఉన్నాయి.

అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వద్దు...

ప్రజల నుంచి వచ్చే అర్జీల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని, సమస్యలను వ్యక్తిగతంగా తెలుసుకుని, క్షేత్రస్థాయిలో పర్యటించి సంతృప్తి చెందేలా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్‌ ద్వారా సత్వరమే పరిష్కరించాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్‌ కలెక్టర్‌ శౌర్యమాన్‌ పటేల్‌, డీఆర్వో వై.సత్యనారాయణరావు అర్జీలు స్వీకరించారు.ఆయా అర్జీలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్‌ అధికారి వి.సుధీర్‌, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్‌రాజా, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలి

నిత్యావసర సరుకుల ధరలను తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా చూడాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా జిల్లా అధ్యక్షురాలు పి.మాణిక్యం, కార్యదర్శి డి.డి.వరలక్ష్మి, కోశాధికారి కె.వి.ఎస్‌.సూర్యప్రభ, జాయింట్‌ సెక్రటరీ ఆర్‌.లక్ష్మిసత్య కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేసి, జేసీకి వినతిపత్రం అందజేశారు. బియ్యం, పప్పులు, వంట నూనెలు, పంచదార, ఉల్లిపాయలు, కూరగాయల ధరలు భారీగా పెరిగిపోయాయని, గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలతో అదనపు భారం పడుతోందన్నారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పనులు తగ్గిపోవడంతో ఆదాయం పడిపోయి పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రేషన్‌ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ హామీ ఇంకా పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం దారుణమని విమర్శించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం మహిళలతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని, జిల్లాలోని పలు మండలాల్లో సంతకాలు సేకరించినట్లు తెలిపారు.

అక్రమ టోల్‌ వసూళ్లపై విచారణ జరపాలి

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏఎంఆర్‌ సంస్థ అక్రమ టోల్‌ గేట్లను ఏర్పాటు చేసి, క్వారీల నుంచి తరలించే మెటీరియల్‌పై టన్నుకు రూ.170 చొప్పున అక్రమంగా వసూలు చేస్తోందని సీపీఎం అనకాపల్లి మండల కన్వీనర్‌ గంటా శ్రీరామ్‌ ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని అక్రమ వసూళ్లతో దోచుకుంటోందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ మైనింగ్‌ను అవకాశంగా తీసుకుని ఏఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు బాబ్జి, సుధాకర్‌ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి లారీలను వెంబడించి మరీ అక్రమంగా వసూళ్లు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వంతో ఏఎంఆర్‌ సంస్థ చేసుకున్న ఒప్పందంలోని నిబంధనలను ఉల్లంఘిస్తూ వసూళ్లు జరపడంపై పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలని కోరారు. అక్రమ మైనింగ్‌, అక్రమ రవాణాను అరికట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని రాబట్టాలన్నారు.

కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలి

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడంతో పాటు 100 శాతం గ్రాస్‌ జీతాన్ని పునరుద్ధరించాలని ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్ట్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్‌ వద్ద ప్లకార్డులతో ఆందోళన చేసి కలెక్టర్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు వినతిపత్రం సమర్పించినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.

స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసీ అధికారులు, ఇతర పారామెడికల్‌, అనుబంధ విభాగాల ఉద్యోగులు అత్యవసర వైద్య సేవల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు. అర్హత, అనుభవం ఉన్న సిబ్బంది దీర్ఘకాలంగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగానే మిగిలిపోయామన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement