మృత్యువులోనూ వీడని బంధం | - | Sakshi
Sakshi News home page

మృత్యువులోనూ వీడని బంధం

Oct 6 2026 12:36 AM | Updated on Oct 6 2026 12:36 AM

● గుర్తు తెలియని వాహనం ఢీకొని భార్యాభర్తల దుర్మరణం ● నుజ్జునుజ్జయిన శరీరాలు ● మొండెం నుంచి వేరుపడ్డ మృతురాలి తల

యలమంచిలి : పెళ్లయినప్పటి నుంచి ఆ దంపతులిద్దరూ ఒకరినొదిలి ఒకరు ఉండేవారు కాదు. మూడు దశాబ్దాలకు పైగా ఎంతో అన్యోన్యంగా జీవించారు. ఆ దంపతుల అనురాగాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో. సోమవారం వేకువజామున ఎప్పటిలాగే ఇంటి నుంచి పొలంలోకి గోమాతల నుంచి పాలు తీసేందుకు వెళ్తుండగా మృత్యువు కబళించింది. గుర్తు తెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనడంతో భార్యా,భర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వారితో పాటు ఉన్న సైకిల్‌ను కిలోమీటరు దూరం వాహనం ఈడ్చుకుపోయింది. భార్యా, భర్తల మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతురాలి తల మొండెం నుంచి వేరుపడింది. యలమంచిలి మండలం పులపర్తిలో తీవ్ర విషాదం నింపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలివి...

పులపర్తికి చెందిన శానాపతి పాపారావు(57), శానాపతి అమ్మాజీ (53) దంపతులు ఎంతో అన్యోన్యంగా వుండేవారు. పొలం పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగా సోమవారం ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి పొలంలోకి ఈ దంపతులిద్దరూ బయల్దేరారు. ఆవులకు, పాడి గేదెలకు గడ్డి వేసి, పాలు తీయడానికి బయల్దేరారు. పాపారావు సైకిల్‌ నడిపిస్తుండగా, అతని భార్య అమ్మాజీ ఆయన వెంట నడుస్తోంది. మరో ఐదు నిమిషాల్లో పొలంలోకి చేరకుంటామనుకునే లోగా వారి ఆశలను మృత్యువు చిదిమివేసింది. అనకాపల్లి నుంచి అడ్డరోడ్డు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే ఆ దంపతులిద్దరూ మృతి చెందారు. ఈ ప్రమాదంలో పాపారావు భార్య అమ్మాజీ తల మొండెం నుంచి వేరవ్వడాన్ని చూసిన వారంతా భయాందోళన చెందారు. ఆమె తల సమీపంలో వున్న పొలంలోకి ఎగిరిపడింది.

ఈ దంపతులకు ఒక కుమారుడున్నట్టు బంధువులు చెప్పారు. భార్యాపిల్లలతో హైదరాబాద్‌లో ఉంటున్న కుమారుడు తల్లిదండ్రుల మరణ వార్త విని హతాశుడయ్యాడు. ఈ సంఘటన గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు నింపింది. ఒకరినొదిలి ఒకరుండలేని ఈ దంపతులిద్దరూ మరణంలో కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. సంఘటనపై యలమంచిలి రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్టు యలమంచిలి రూరల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ బెజవాడ రామకృష్ణ తెలిపారు. సమీపంలో పలు హైవే జంక్షన్లలో వున్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఒక లారీపై అనుమానం ఉండడంతో దాని కదలికలను గుర్తించేందుకు సాంకేతిక ఆధారాలు పరిశీలిస్తున్నారు. పాపారావు, అమ్మాజీల మృతదేహాలను యలమంచిలి మార్చురీకి తరలించి శవపంచనామా అనంతరం పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబసభ్యులకు అప్పగించారు. యలమంచిలిలో శవాగారం వద్దకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు చేరుకుని మృతుల కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం పులపర్తిలో మృతులకు అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామస్తులు శ్మశానవాటికకు తరలివచ్చి వీడ్కోలు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement