ఏయూకి చెందిన రూ.300 కోట్ల విలువైన భూమి బదలాయింపునకు స్కెచ్ సిటీ సెంట్రల్ లైబ్రరీ కోసం రెండు ఎకరాల కేటాయింపు రంగం సిద్ధం చేస్తున్న ఏయూ యంత్రాంగం వీఎస్ కృష్ణా లైబ్రరీని ఆధునికీకరించలేరా? ఇంటర్నెట్ కేబులింగ్‌పై రూ.5కోట్ల ఖర్చుకు ప్లాన్ రెడీ ఉచితంగా కేబులింగ్‌కు సంస్థలు సిద్ధమైనా డోన్ట్‌కేర్
విశాఖవిద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయానికి చెందిన వందల కోట్ల విలువైన భూములను ఇతర అవసరాలకు కేటాయించే ప్రతిపాదనలపై పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు, విశ్వవిద్యాలయ వర్గాల్లో తీవ్ర ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నగర నడిబొడ్డులో ఉన్న ఏయూ భూములను భవిష్యత్ అవసరాల కోసం కాపాడాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉందని వారు పేర్కొంటున్నారు. కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగం సమీపంలోని సుమారు రెండు ఎకరాల భూమిని సిటీ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటుకు కేటాయించే ప్రతిపాదనపై పునరాలోచించాలని కోరుతున్నారు.
రూ.300 కోట్ల భూమి బదలాయింపా?
ఏయూలో కీలక ప్రాంతంలో ఉన్న ఈ రెండు ఎకరాల భూమి ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.300 కోట్లకు తగ్గదని వర్గాలు పేర్కొంటున్నాయి. ఇంత విలువైన భూమిని బదలాయించే ముందు, దాని వల్ల విశ్వవిద్యాలయానికి కలిగే ప్రత్యక్ష, దీర్ఘకాలిక ప్రయోజనం ఏమిటో వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్ విస్తరణకు అవసరమయ్యే భూములను ఇప్పుడు ఇతర అవసరాలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రూ.5 కోట్లతో వీఎస్ కృష్ణా లైబ్రరీ ఆధునికీకరణ సాధ్యం కాదా?
సిటీ సెంట్రల్ లైబ్రరీ కోసం కొత్తగా భూమి కేటాయించే బదులు, ఇప్పటికే ఉన్న వీఎస్ కృష్ణా లైబ్రరీని ఆధునికీకరించాలని పూర్వ విద్యార్థులు సూచిస్తున్నారు. సుమారు రూ.5 కోట్లతో డిజిటల్ లైబ్రరీ, ఈ–జర్నల్స్, పరిశోధనా సదుపాయాలు, ఆధునిక పఠన గదులు ఏర్పాటు చేయవచ్చని పేర్కొంటున్నారు. వీఎస్ కృష్ణా లైబ్రరీ ఏయూ చరిత్రలో కీలక భాగమని, ఇక్కడ చదువుకున్న అనేక మంది విద్యార్థులు సివిల్ సర్వెంట్లు, వైద్యులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని గుర్తుచేస్తున్నారు.
మెగా హాస్టళ్లపై సందేహాలు
ఏయూలో ఇప్పటికే 40కి పైగా హాస్టళ్లు ఉన్నాయని, ప్రధాన సమస్య హాస్టళ్ల కొరత కాదని విద్యార్థి వర్గాలు చెబుతున్నాయి. నిర్వహణ, మరమ్మతులు, పారిశుధ్యం, మౌలిక సదుపాయాల ఆధునికీకరణపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. గతంలో ఒక్కో హాస్టల్‌లో సుమారు 200 మందికి మించకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం వల్ల నిర్వహణ సులభంగా ఉండేదని పేర్కొంటున్నారు. భారీ వ్యయంతో మెగా హాస్టళ్ల నిర్మాణం ఎంతవరకు ప్రయోజనకరమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
రూ.44 కోట్ల మెగా మెస్.. సాధ్యమేనా?
సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏయూ క్యాంపస్‌లో రూ.44 కోట్లతో ఒకే మెగా మెస్ నిర్మించే ప్రతిపాదనపైనా చర్చ జరుగుతోంది. ఒకే మెస్ ద్వారా విద్యార్థుల భోజన సమస్యలను పరిష్కరించవచ్చని చెబుతున్నప్పటికీ, వేలాది మంది విద్యార్థులు ఒకే చోటకు వెళ్లడం వల్ల దూరం, రద్దీ, సమయపాలన, ఆహార పంపిణీ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రూ.5 కోట్ల ఇంటర్నెట్ కేబులింగ్ వెనుక మతలబు
క్యాంపస్‌లో ఇంటర్నెట్ కేబులింగ్ కోసం సుమారు రూ.5 కోట్లు ఖర్చు చేసే ప్రతిపాదనపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు ఉచితంగా కేబులింగ్ చేసేందుకు ముందుకు వస్తున్న పరిస్థితుల్లో, విశ్వవిద్యాలయ నిధులతో తవ్వకాలు చేపట్టాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఏయూ ఇప్పటికే ఆప్టికల్ ఫైబర్, వైర్డ్, వైర్‌లెస్ నెట్‌వర్క్ సదుపాయాలు ఉన్నట్లు అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొన్న నేపథ్యంలో కొత్త కేబులింగ్ అవసరంపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.
2018 భూమి ఆదాయం ఏది?
2018లో బీచ్ రోడ్డులోని సుమారు రెండు ఎకరాల ఏయూ భూమిని వుడాకు యుద్ధ విమానాల మ్యూజియం కోసం కేటాయించారని, దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని విశ్వవిద్యాలయంతో పంచుకుంటామని అప్పట్లో చెప్పినప్పటికీ ఇప్పటివరకు ఏయూకు ఒక్క రూపాయి కూడా అందలేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఇచ్చిన భూముల ప్రయోజనాలపై స్పష్టత లేకుండానే మరో విలువైన భూమిని కేటాయించే ప్రతిపాదనపై సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు.
నిర్ణయాలపై పారదర్శకత అవసరం
ఏయూ భూముల కేటాయింపులు, భారీ నిర్మాణాలు, ఖర్చుల విషయంలో విశ్వవిద్యాలయా నికి కలిగే ప్రయోజనాలను బహిరంగంగా వెల్లడించాలని పూర్వ విద్యార్థులు, విద్యావేత్తలు కోరుతున్నారు. విలువైన ఆస్తులను కాపాడటంతో పాటు అనవసర వ్యయాలను నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


