గొరపూడి భూముల్లో పనులు నిలిపివేయాలి
లాలం నర్సింగరావు మృతదేహాన్ని సందర్శించిన ధర్మశ్రీ, బొడ్డేడ
రాంబిల్లి: సెజ్ రెండో విడత భూ సేకరణలో గల గొరపూడి భూముల్లో ఫెన్సింగ్ పనులను తక్షణమే ఆపాలని యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌తో కలిసి గొరపూడి శివారు అప్పన్నపాలెంకు చెందిన లాలం నర్సింగరావు మృతదేహాన్ని సందర్శించి కుటుంబసభ్యులకు ఽధైర్యం చెప్పారు. తమ భూములకు నష్టపరిహారం చెల్లించకుండా ఫెన్సింగ్ పనులు అధికారులు చేపట్టడంతో ఆందోళనకు లోనై తన తండ్రి మృతి చెందారని కుమార్తెలు నిరీష, కుమారి అన్నారు. కనీసం మృతదేహంపై టెంట్ కూడా అధికారులు వేసుకోకుండా చేశారని భార్య నారాయణమ్మ వాపోయారు. దీనికి స్పందించిన ధర్మశ్రీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని ధర్మశ్రీ ఆర్డీవో రామలక్ష్మిని కోరారు. రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా భూముల్లో ఫెన్సింగ్ పనులు చేస్తే చూస్తూ ఊరుకోమని తహసీల్దార్ పీవీ రత్నంకు స్పష్టం చేశారు. రాజ్యాంగం, కోర్టు నిబంధనలు కాదని ఫెన్సింగ్ వేస్తే రైతులతో కలిసి యంత్రాలతో ఫెన్సింగ్ తీసివేస్తామని ధర్మశ్రీ హెచ్చరించారు. నష్టపరిహారం చెల్లించకుండా భూములు స్వాధీనం చేసుకోవడం దారుణమని బొడ్డేడ ప్రసాద్ ద్వజమెత్తారు. రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ సమక్షంలో రైతులతో చర్చలు జరిపిన తర్వాతే పనులు నిర్వహించాలని అప్పటివరకు పనులు ఆపాలన్నారు. అలాగే మృతి చెందిన రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. దీనిపై తహసీల్దార్ పీవీ రత్నం మాట్లాడుతూ, ఈ భూములు లారస్ కంపెనీకి ప్రభుత్వం కేటాయించిందని, ఆయా కంపెనీ యాజమాన్యం రూ 25 లక్షలతో పాటు కుమార్తెలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. కాగా గొరపూడి వెళ్లేందుకు వస్తున్న ధర్మశ్రీని వెంకటాపురం వద్ద పోలీసులు అరగంట సేపు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పిన్నంరాజు కిషోర్, గొట్టిముక్కల శ్రీనుబాబు, ధూళి నాగరాజు, ఎన్‌వీ సూర్యనారాయణ, శంకర్రావు, గొర్లె నర్సింగరావు, రుత్తల గణేష్ తదితరులు పాల్గొన్నారు.


