ఉపాధి హామీ పథకం పేరు మారినా తీరు మారలేదు. ఈ ఏడాది జూలై 1 నుంచి వీబీజీరామ్‌జీగా కొత్త విధానంతో పథకం అమలవుతున్నా శ్రామికులకు సకాలంలో వేతనాలు అందడం లేదు. కొత్త విధానంలో పని దినాలు పెరగడంతో పాటు ప్రతి వారం సకాలంలో వేతనాలు వచ్చేస్తాయని అధికారులు గ్రామ సభల్లో చెప్పారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
వేతనాల్లేని..
జూన్ 8 తర్వాత నుంచి ఎదురుచూపులే ఇల్లు గడవక కూలీల ఇబ్బందులు వీబీజీరామ్‌జీ పథకం అమల్లోకి వచ్చినా మారని తీరు
జిల్లాలో బకాయిలు 110.53 కోట్లు
మొత్తం జాబ్ కార్డులు
2,73,320
వేతనదారులు 2,44,823
2026–27 ఆర్థిక సంవత్సరంలో
పని దినాలు : 1,08,22,802
యలమంచిలి రూరల్: ఓ పక్క వర్షాలు కురవక జిల్లాలో పంటల సాగు గణనీయంగా తగ్గింది. వేసిన పంటలూ ఎండిపోయాయి. వ్యవసాయ పనులు దొరకడం లేదు. జిల్లాలో రాంబిల్లి, మాడుగుల మండలాలు మినహా మిగతా 22 మండలాలను అధికారులు కరువు మండలాలుగా ప్రకటించారు. ఉన్న ఊర్లు వదిలి వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఈ కష్టకాలంలో కల్పతరువుగా నిలవాల్సిన ఉపాధి పథకం సకాలంలో వేతనాలు చెల్లించకపోవడంతో కూలీలకు కష్టాలు తెచ్చిపెడుతోంది.ఈ ఏడాది జూన్ 9 నుంచి జిల్లాలో చేసిన పనులకు బిల్లులు అందక శ్రామికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తోందని కూలీలు వాపోతున్నారు.
రూ.110 కోట్ల బకాయిలు
జిల్లాలో 2,44,823 మంది వేతనదారులకు 110.53 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. వేతనాల కోసం ఎదురుచూస్తున్న వీరందని పరిస్థితి దయనీయంగా ఉంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాలు కూలీల పరిస్థితిని పట్టించుకోకపోవడంతో వారంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోదామన్నా కుటుంబ పరిస్థితులు అనుకూలించడం లేదని, వెంటనే బకాయి వేతనాలను చెల్లించండి మహాప్రభో అని వారంతా వేడుకుంటున్నారు.
వేతనం పెంచినా..
వీబీజీరామ్‌జీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత రోజువారీ గరిష్ట వేతనాన్ని రూ.307 నుంచి రూ.312కి పెంచారు.
ఎల్‌నినో ప్రభావంతో గ్రామాల్లో పనులకు వచ్చే కూలీల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గ్రామాల్లో జల వనరుల సంరక్షణ, పంట కాలువల్లో పూడికతీత, రోడ్లు, డ్రెయిన్ల నిర్మా ణం, పండ్ల తోటల పెంపకం వంటి పనులను చేశారు. ఆలస్యం లేకుండా త్వరగా వేతనాలు అందించడం వీబీజీరామ్‌జీ పథకం లక్ష్యం కాగా ఆరంభంలోనే వేతనాలకు శ్రామికులు ఇబ్బందులు పడే పరిస్థితులు నెలకొనడం పట్ల కూలీల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పనులు చేసినా వేతనాలు లేవు
ఈ ఏడాది జూన్ 30 వరకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు రూ.54.64 కోట్లు, జూలై 1వ తేదీ నుంచి అమలవుతున్న వీబీజీరామ్‌జీ పథకం కింద రూ.55.89 కోట్లు మొత్తం రూ.110.53 కోట్ల బకాయిలు కూలీలకు చెల్లించాల్సి ఉంది. పాత, కొత్త పథకాల కింద పనులు చేసినా వేతనాలు అందని దుస్థితి జిల్లాలో నెలకొంది. బిల్లుల కోసం వేలాది కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి.


