అనకాపల్లి: జాతీయ రహదారి మారేడుపూడి పంచాయతీ సర్వే నంబర్ 357లో ప్రభుత్వ స్థలాల్లో కూటమి పాలనలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. మారేడుపూడీ బీసీ కాలనీలో ఇప్పటికే ప్రభుత్వ స్థలాలను అక్రమించి, రెండు, మూడు అంతస్తుల భవనాలు నిర్మించారు. మరికొన్ని గృహాలు పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో ముందుగా టార్పాలిన్లు కట్టి, మొక్కలు నాటి కొన్ని రోజులు గడిచిన తరువాత ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి, గృహాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నారు. ఆదివారం మారేడుపూడి బీసీ కాలనీలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక వ్యక్తి పదవీ విరమణ చెందగా మరో ఇద్దరు ప్రభుత్వ శాఖలో పనిచేస్తూ దర్జాగా ప్రభుత్వ స్థలాన్ని అక్రమించి, ప్రహరీ గోడ నిర్మాణ పనులు చేపడుతున్నారు. గోడకు అడ్డంగా ఎర్రటి సైడ్‌వాల్‌ను నిర్మించి, దానికి అనుకుని సుమారుగా నాలుగు సెంట్లలో ప్రహరీ గోడ నిర్మాణం జరుగుతుంది. విషయం తెలుసుకున్న స్థానిక వీఆర్వో సంఘటన స్థలానికి చేరుకుని ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ నిర్మించవద్దని కోరగా అక్కడే నిర్మాణం చేపడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు వీఆర్వో, వీఆర్‌ఏలపై దురుసుగా ప్రవర్తించారని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో రెవెన్యూ అధికారులు బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు సూచిస్తున్నారు. ఈ విషయంలో ఉన్నత స్థాయి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


