మరో కొండకు టెండర్‌ | - | Sakshi
Sakshi News home page

మరో కొండకు టెండర్‌

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

చంద్రబాబు ప్రభుత్వంలో జిల్లాలో మైనింగ్‌ మాఫియా విచ్చలవిడిగా పెట్రేగిపోతోంది. రెండున్నరేళ్ల పాలనలో కేజీఎఫ్‌ తరహాలో కొండలను పిండిచేసి సొమ్ము చేసుకుంది. చివరికి దైవ క్షేత్రాలను కూడా వదలకుండా అక్రమంగా మైనింగ్‌కు పాల్పడింది. ఇప్పుడు పేద రైతులు పోడు వ్యవసాయం చేసుకునే కొండ ప్రాంతాలపై కన్నేసింది. స్వయంగా హోంమంత్రి ఇలాకాలోనే స్థానిక కూటమి నేతల అండదండలతో పోడు కొండపై నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు అధికారులు అనుమతులిచ్చినట్టు స్పష్టమవుతోంది.

కోటవురట్ల మండలంలో పిప్పళ్ల కొత్తపల్లి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌కు అనుమతిచ్చిన కొండ

సాక్షి, అనకాపల్లి : జిల్లాలో చట్టబద్ధమైన అనుమతులున్న క్వారీల కంటే అక్రమ మైనింగ్‌ క్వారీల సంఖ్యే ఎక్కువగా ఉంది. కూటమి ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో, మైనింగ్‌ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేస్తున్నారు. తాజాగా అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం పిప్పళ్ల కొత్తపల్లి (పి.కొత్తపల్లి) గ్రామంలోని సర్వే నంబర్‌ 190లో ఉన్న 285 ఎకరాల విస్తీర్ణంగల కొండ ప్రాంతంలో మైనింగ్‌కు అనుమతి ఇవ్వడంపై స్థానిక రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్న కొండపై మైనింగ్‌కు ఎలా అనుమతిస్తారని మండిపడుతున్నారు. ఈ కొండను కొల్లగొట్టేందుకు కొందరు రాజకీయ నాయకులు, కూటమి నేతలు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ కొండపై దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్న పి.కొత్తపల్లి రైతులకు గతంలోనే ప్రభుత్వం ‘డి–ఫారం’ పట్టాలు మంజూరు చేసింది. అయితే, అక్కడ ఉన్న మెటల్‌, విలువైన రాళ్లను తోడేసి రూ. కోట్లు కొల్లగొట్టేందుకు కొందరు స్వార్థపరులు ఈ కుట్రకు తెరలేపారు.

స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలు

కోటవురట్ల మండలం పి.కొత్తపల్లి సర్వే నంబరు 190లో కొండపై మైనింగ్‌ తవ్వకాలకు దళారులు, కూటమి నాయకులు ఏకమయ్యారు. దీనికిగాను పాయకరావుపేటకు చెందిన ‘మణికంఠ గొంతిరెడ్డి స్టోన్‌్‌ క్రషర్‌’కు నిబంధనలకు విరుద్ధంగా లైసెన్స్‌ కట్టబెట్టారు.

ఈ లైసెన్స్‌ మంజూరుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం అనివార్యం. బయటి వ్యక్తులను తీసుకొచ్చి సమావేశం పేరుతో పోలీసు బలగాల మధ్య బెదిరింపులకు దిగుతూ ప్రజాభిప్రాయ సేకరణ ముగించారు. మైనింగ్‌ శాఖ ఇచ్చిన అనుమతి ఉత్తర్వుల్లో ఒకటి 18 హెక్టార్లు, మరొకటి 6 హెక్టార్లుగా ఉంది. ఒకటి గొంతిరెడ్డి స్టోన్‌ క్రషర్‌ పేరు మీద ఉండగా.. మరొకటి 2015లో పాయకరావుపేటకు చెందిన కూండ్రపు కృష్ణ పేరు మీద ఉన్నట్టు సమాచారం. అయితే కొత్తగా వచ్చిన జీవోలో కూండ్రపు కృష్ణ పేరు లేకపోవడం గమనార్హం. గతంలోనే అనుమతులిచ్చామని అధికారులు చెప్తున్నప్పటికీ, అక్కడ ఇప్పటివరకు ఎలాంటి తవ్వకాలు జరగలేదు. పదేళ్ల క్రితం ఇచ్చిన అనుమతులు ఇప్పటివరకు ఎందుకు బయటపడలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా కల్పితమని మండిపడుతున్నారు.

ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే..

సదరు కొండ గ్రామానికి 500 మీటర్ల దూరంలోనే ఉంటే, అధికారిక ఉత్తర్వుల్లో మాత్రం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చూపి అక్రమాలకు పాల్పడ్డారు. సర్వే నంబరు 190లో 285 ఎకరాల్లో 65 ఎకరాలకుపైగా స్థానిక రైతుల డి–పట్టాలు ఉన్నప్పటికీ, వారి అభిప్రాయం తీసుకోకుండా మైనింగ్‌ లైసెన్స్‌ ఇవ్వడంపై మండిపడుతున్నారు. ‘శ్రీ మణికంఠ గొంతిరెడ్డి రోడ్డు అండ్‌ బిల్డింగ్‌ స్టోన్‌ క్రషర్‌’ సంస్థకు లైసెన్స్‌ కట్టబెట్టే ప్రక్రియలో మైనింగ్‌, రెవెన్యూ, ఫారెస్ట్‌ విభాగాలు భారీగా ముడుపులు తీసుకున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక మంత్రి అండదండలతోనే ఈ దందా నడుస్తోందని రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

పర్యావరణం, ఆరోగ్యంపై కోలుకోలేని దెబ్బ

ఇక్కడ మైనింగ్‌, క్రషింగ్‌ ప్రారంభిస్తే వచ్చే దుమ్ము, ధూళితో గ్రామం మొత్తం తీవ్ర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని పి.కొత్తపల్లి గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణమే మైనింగ్‌ అనుమతులు రద్దు చేయాలని, పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఈ క్రషర్‌కు అనుమతులు రద్దు చేయాలంటూ స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు.

రెండు రోజుల క్రితం స్థానిక రెవెన్యూ అధికారి, మైనింగ్‌ ఏడీకి కూడా అక్రమ మైనింగ్‌ అనుమతులను తక్షణమే రద్దు చేయాలంటూ విన్నవించుకున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. స్థానిక గ్రామస్తులు, రైతుల ఆవేదనను కూడా వినడానికి అధికారులు గంటల తరబడి వేచి ఉండాలని నిబంధనలు పెట్టారంటే.. స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంత భయపడుతున్నారో స్పష్టమవుతోందని వాపోయారు.

పోడు వ్యవసాయం చేస్తున్న కొండపై మైనింగ్‌కు కుట్ర!

దశాబ్దాలుగా ఇదే కొండ రైతులకు జీవనాధారం

కోటవురట్ల మండలం పి.కొత్తపల్లిలో సర్వే నంబరు 190లో 285 ఎకరాల కొండ

నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ లైసెన్స్‌

గ్రామానికి 500 మీ. దూరంలో ఉంటే.. జీవోలో 12 కి.మీ దూరంలో ఉన్నట్లు వెల్లడి

రైతులకు, గ్రామస్తులకు తెలియకుండానే ప్రజాభిప్రాయ సేకరణ

పాయకరావుపేటకు చెందిన మణికంఠ గొంతిరెడ్డి స్టోన్‌ క్రషర్‌’కు అనుమతి

మంత్రి అండదండలతోనే నిర్వాకం

పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు, రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement