కలెక్టర్‌ గారు మీరైనా స్పందించండి | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ గారు మీరైనా స్పందించండి

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

● పూర్తి అంగవైకల్యం ఉన్నా సదరంలో 14 శాతం నమోదు ● దాతలైనా సాయం చేయరూ.. ● దివ్యాంగ విద్యార్థి ఆవేదన

గొలుగొండ : అంగవైకల్యం ఉన్నా సదరం క్యాంప్‌లో అన్యాయం జరిగిందని ఓ దివ్యాంగ విద్యార్ధి ఆవేదన.. నడవలేని, లేవలేని దుస్థితిలో ఉన్నా సదరం క్యాంప్‌లో 14 శాతం వైకల్యం నమోదు.. కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థుల సాయంతో తప్ప పాఠశాలకు వెళ్లలేని దుస్థితి. కనీసం సదరం క్యాంప్‌లో న్యాయం జరుగుతుందని ఆశపడినా ప్రయోజనం శూన్యం. మండలంలో చోద్యం జిల్లా పరిషత్‌ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న నందిక అభిషేక్‌ దయనీయ పరిస్థితి ఇది. పూర్తి అంగవైకల్యం ఉన్నా క్యాంప్‌లో 14శాతం ఇవ్వడంపై ఈ పేద విద్యార్థితోపాటు తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

ఇదీ సమస్య

నందిక అభిషేక్‌కు కాళ్లు, వెన్నుముక, నడుము పనిచేయడం లేదు. రెండేళ్ల క్రితం వరకు కొంతమేర బాగున్నా, వయస్సు పెరిగే కొలది అవయవాల్లో మార్పులు లేకపోవడం వల్ల ఎదుగుదల లేదని వైద్యులు తెలిపారు.

తోటి విద్యార్ధులు, తల్లిదండ్రుల సాయంతో..

అభిషేక్‌ ప్రతిరోజు హైస్కూల్‌కు రావాలంటే నరకమే. ఇదే గ్రామానికి చెందిన నందిక రమణ దంపతులకు ఒక్కగాను ఒక్క కుమారుడు అభిషేక్‌ ఆరోగ్య పరిస్థితి చూసి ప్రతీరోజు తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తండ్రి రమణ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. పేదరికం కావడం తల్లి కూలికి వెళితే తప్ప పూట గడవడం కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో సదరం క్యాంప్‌ ద్వారా అయినా సర్టిఫికెట్టు మంజూరైతే కనీసం పింఛను డబ్బులతోనైనా పోషించుకోవడం జరుగుతుందని ఆశ పడితే నిరాశే మిగిలింది. మే 26న సదరం స్లాట్‌లో పరీక్షలకు వెళితే పూర్తి అంగవైకల్యం ఉన్నా 14శాతం మంజూరు చేశారని ఆవేదన చెందుతున్నారు. మరలా స్లాట్‌ ఓపెన్‌ కావాలంటే ఏడాది వేచి ఉండాల్సిందే. ఇటువంటి సమయంలో జిల్లా విద్యాశాఖ, జిల్లా కలెక్టర్‌ దృష్టి సారించి న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

దాతలైనా సాయం చేయండి

చోద్యం గ్రామం నుంచి హైస్కూల్‌కు కిలోమీటర్‌ దూరం ఉంది. తండ్రికి అనారోగ్య పరిస్థితి, తల్లి కూలికి వెళితే తప్ప పూట గడవదు. ఇటువంటి తరుణంలో అభిషేక్‌కు దాతలు సాయం చేయాలని పలువురు కోరతున్నారు. బ్యాటరీ రిక్షా, లేక ఏ ఇతర వాహనం అయినా దాతలు సమకూరిస్తే ఈ విద్యార్థి స్కూల్‌కి ఎవరి సాయం లేకుండా వెళ్లి విద్య నభ్యసించడానికి వీలవుతుందని పలువురు కోరుతున్నారు.

తోటి విద్యార్థి సాయంతో స్కూల్‌కు వస్తున్న అభిషేక్‌

సదరం క్యాంప్‌లో 14 శాతంగా ఇచ్చిన మెడికల్‌ సర్టిఫికెట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement