కోతుల సమస్య లేకుండా జిల్లాలో అన్ని కేజీబీవీలకు సోలార్ ఫెన్సింగ్
కలెక్టరు చొరవతో మొదటిగా నాతవరం కేజీబీవీకి కంచె ఏర్పాటు
జిల్లాలో 91 పాఠశాలకు అదనపు భవన నిర్మాణాలకు రూ.9కోట్ల మంజూరు
కేజీబీవీల్లోకి బయట ఆహారం తీసుకెళ్తే ఎస్‌వోలదే బాధ్యత
సమగ్ర సర్వశిక్షా అభియాన్ అడిషనల్ కో ఆర్డినేటరు శ్రీరాములు
నాతవరం : జిల్లాలో కస్తూర్బా పాఠశాలలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని సర్వశిక్షా అభియాన్ సమగ్ర అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటరు కె. శ్రీరాములు అన్నారు. ఆయన సోమవారం సాయంత్రం మర్రిపాలెంలో కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిత్యావసర సరుకులు, కోడిగుడ్లు నాణ్యతను పరిశీలించారు. తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 20 కస్తూర్బా పాఠశాలలు ఉన్నాయని, ఆయా పాఠశాలల్లో 5,600 పైగా విద్యార్థులు చదువుతున్నారన్నారు. కస్తూర్బా పాఠశాలలో జిల్లా వ్యాప్తంగా 18 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. కోతుల ఇబ్బందులు నివారణలో భాగంగా జిల్లాలోనే మొట్ట మొదటిగా నాతవరం మండలం మర్రిపాలెం కేజీబీవీకి కలెక్టరు చొరవతో రూ.3 లక్షలతో సోలార్ కంచె ఏర్పాటు చేశామన్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని కస్తూర్బా పాఠశాలల్లో సోలార్ కంచె ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. రానున్న రోజుల్లో జిల్లాలో అన్ని కేజీబీవీలకు సోలార్ లైట్లు సోలార్ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే చాలా స్కూళ్లలో విద్యార్థినుల కోసం వేడి నీళ్లు మరగబెట్టడానికి సోలార్ ప్లాంట్లు పెట్టామన్నారు. కలెక్టర్ అనుమతించిన అధికారులు మాత్రమే కేజీబీవీలోకి ప్రవేశించాలని, కేజీబీవీలో తయారు చేసిన వంటకాలు తప్ప బయట నుంచి ఎలాంటి ఆహారం లోపలకు తీసుకురాకూడదని, దానికి పూర్తి బాధ్యత ఆయా ప్రిన్సిపాళ్లదేనని స్పష్టం చేశారు.
విద్యార్థినులకు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు, ప్రతి రోజు వ్యాయామం తప్పనిసరి ఉంటుందని తెలిపారు. రక్తహీనత గల విద్యార్థినులను గుర్తించి వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. జిల్లాలో ఎక్కడైనా కేజీబీవీల్లో మరుగుదొడ్లు ఇతర సామాగ్రి శిథిలమైతే యుద్ధ ప్రతిపాదికన బాగు చేసేందుకు నిధులు ఉన్నాయన్నారు. కేజీబీవీలో వసతి సమస్యలేకుండా అదనపు భవనాలు నిర్మించామని తెలిపారు. నాతవరం మండలంలో రూ.2.10 కోట్లతో అదనపు భవన నిర్మాణం పూర్తి చేశామని, త్వరలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసామన్నారు. జిల్లాలో 91 పాఠశాలలకు రూ.9 కోట్లు మంజూరయ్యాయని వాటిని త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. గతంలో మంజూరైన భవన నిర్మాణ పనులు వివిధ దశల్లో జరుగుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాతవరం ఎంఈవో కామిరెడ్డి వరహాలబాబు సమగ్ర విభాగం జేఈ రమణజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


