చోడవరం : కూటమి ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే గొంతునొక్కి అక్రమ అరెస్టులు చేయడమే పనిగా చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తుందని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ చోడవరం కార్యాలయంలో జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, తాజా మాజీ కార్పొరేటర్, యూత్ విభాగం ప్రతినిధి జాజుల రమేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం చేతకాక వారిని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధంలేని తమ పార్టీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కానుమూరి సునీల్‌ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని యువజన విభాగం ఖండిస్తుందని, ఇటువంటి అక్రమ అరెస్టులకు తాము భయపడేదిలేదన్నారు. 2014–19మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు, బెల్టుషాపులు విచ్ఛలవిడిగా నిర్వహించడం వల్ల అనేక నేరాలు జరిగాయన్నారు. 2019 తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చి ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే మద్యం అమ్మకాలపై అనే కఠిన నిబంధనలు విధించి షాపుల సంఖ్యలో 40 శాతానికి తగ్గించి, బెల్టు షాపులు లేకుండా ఎక్కడికక్కడ కట్టడి చేశారన్నారు. దీనివల్ల గడిచిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో నేరాల సంఖ్య కూడా చాలా వరకూ తగ్గిందన్నారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలోనే అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు ఇచ్చి, ఎక్కడికక్కడ షాపులు పెట్టి, అక్రమంగా బెల్టు షాపులు, పర్మిట్ రూమ్‌లు నిర్వహించి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ధ్వజమెత్తారు. విచ్చలవిడి మద్యం అమ్మకాల వల్ల ఎక్కడపడితే అక్కడ మద్యం బాబులు రోడ్లపై గొడవలు చేస్తుండడంతో మహిళలు, స్కూల్ పిల్లలు, పెద్దలు భయాందోళనకు గురికావలసి వస్తుందన్నారు. మద్యం బాటిళ్లపై కూడా ధరలు పెంచి అక్రమ వసూళ్లు చేస్తూ దోచుకుంటున్నారన్నారు. వాటిని అరికట్టలేని చంద్రబాబు ప్రభుత్వం అలాంటి అన్యాయాలను ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తుందన్నారు. విద్య, వైద్యం, సూపర్‌సిక్స్ పథకాలు సకాలంలో సక్రమంగా ప్రజలు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, అంతేకాని ఇలా అక్రమ అరెస్టులు, కేసులు పెట్టి ప్రశ్నించే గొతులు నొక్కాలని ప్రయత్నిస్తే ప్రతిఘటించి రోడ్లపైకి వచ్చి ప్రజల తరపున ఆందోళనలు చేయాల్సి వుంటుందని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి గొంది సిద్దు, కార్యదర్శి బొండా చిన్నారావు, ఉపాధ్యక్షుడు రుద్రనాయుడు, సభ్యులు పెచ్చేటి మణిరాజు, నియోజవర్గం స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు బూరా బాలాజీ, మండల యూత్ అధ్యక్షుడు పల్లా ధనాజీ, ఉపాధ్యక్షుడు సంతోష్, సకలా సూరిబాబు పాల్గొన్నారు.


