మాడుగుల: ఉత్తరాంధ్ర ప్రధాన ఇలవేల్పు, మాడుగుల మోదమాంబ అమ్మవారి జాతర మంగళవారం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి రానుండడంతో ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయం వద్ద బారికేడ్లు, క్యూలైన్ల ద్వారా భక్తులకు దర్శనం కల్పించనున్నారు. ఆలయం వద్ద నుంచి పలు ప్రధాన ప్రదేశాల్లో దాతల సహకారంతో ఉచితంగా మజ్జిగ, తాగునీరు, ప్రసాదం పంపిణీ చేపట్టనున్నారు.
భారీ బందోబస్తు
జాతరకు బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎస్‌ఐ జి. నారాయణరావు తెలిపారు. ఎస్పీ తుహిన్‌సిన్హా ఆదేశాలతో అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, పర్యవేక్షణలో కె.కోటపాడు సీఐ కృష్ట ఆధ్వర్యంలో
250 మంది పోలీసులు, 14 మంది ఎస్‌ఐలు, ముగ్గురు సీఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ బందోబస్తులో ఉంటా
రన్నారు.
ట్రాఫిక్ ఏర్పాట్లు
జాతర సందర్భంగా విశాఖ, అనకాపల్లి, చోడవరం, నుంచి వచ్చే అన్ని ప్రెవేటు, ఆర్టీసీ బస్సులు వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద నిలుపుదల చేయనున్నట్టు ఎస్‌ఐ తెలిపారు. ఎం.కోడూరు మీదుగా వచ్చే వాహనాలను మోదకొండమ్మ ఆలయం వెనుక భాగంలో, సాగరం మీదుగా వచ్చే వాహనాలను మోదమాంబ కాలనీ వద్ద, ఖండివరం, బోయపాడు, నుంచి వాహనాలను తహసీల్దారు కార్యాలయం వద్ద నిలుపుదల చేయనున్నట్టు తెలిపారు. పలు చోట్ల జరిగే వినోద కార్యక్రమాలు వద్ద ఆదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జాతర విజయవంతానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.


