జాతరకు వెళ్లి వస్తూ విషాదాంతం | - | Sakshi
Sakshi News home page

జాతరకు వెళ్లి వస్తూ విషాదాంతం

Jun 2 2026 3:00 AM | Updated on Jun 2 2026 3:00 AM

● బైకు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఇద్దరు యువకులు ● సంఘటన స్థలంలోనే మృతి ● జంపెనలో విషాదఛాయలు

మాడుగుల రూరల్‌ : మండలంలో జంపెన గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఆదివారం అర్ధరాత్రి బైక్‌ మీద వస్తూ చెట్టును ఢీకొట్టిన ప్రమాదంలో సంఘటన స్థలంలో మృతి చెందారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఎస్‌ఐ జి.నారాయణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. జంపెన గ్రామానికి చెందిన దాసరి వరుణ్‌ (18), పెచ్చేట్టి సాయి కిరణ్‌ (17), ఆదివారం గాదిరాయిలో జరిగిన మోదమాంబ జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా, అర్ధరాత్రి 12 గంటల సమయంలో గాదిరాయి నుంచి జంపెన మార్గమధ్యంలో వీరనారాయణం టి.జంక్షన్‌ వద్ద బైక్‌ ఆదుపు తప్పి, పక్కనే వున్న తాటిచెట్టును బలంగా ఢీకొట్టారు. దీంతో ఇరువురు యువకులకు తలకు బలమైన గాయాలు తగిలి, తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా గ్రామానికి చెందిన ఇద్దరు యువకుల మృతితో జంపెనలో విషాదచాయలు అలముకున్నాయి. మృతులు ఇద్దరూ బంధువులు. ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన వరుణ్‌కు తండ్రి ఐదేళ్ల క్రితం మరణించగా, తల్లి, సోదరుడు ఉన్నారు. సాయికిరణ్‌కు తల్లిదండ్రులు, సోదరుడు, సోదరి ఉన్నారు.

ప్రమాదంలో మృతి చెందిన దాసరి వరుణ్‌, సాయి కిరణ్‌

Advertisement
 
Advertisement
Advertisement