నిర్ణీత గడువులోగా పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

నిర్ణీత గడువులోగా పరిష్కారం

Jun 2 2026 3:00 AM | Updated on Jun 2 2026 3:00 AM

● పీజీఆర్‌ఎస్‌ అర్జీలపై కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ ఆదేశం

అనకాపల్లి టౌన్‌: పీజీఆర్‌ఎస్‌కు వచ్చిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ విజయ్‌కృష్ణన్‌ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో ఆమె డీఆర్వో వై. సత్యనారాయణరావు, డిప్యూటీ కలెక్టర్‌ సుబ్బలక్ష్మిలతో కలిసి అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందన్నారు. ముఖ్యంగా రెవెన్యూ, గ్రామీణాభివృద్ధి, విద్యుత్‌, తాగునీరు తదితర శాఖల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారుడు సంతృప్తి చెందేలా క్షేత్రస్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు తిరస్కరించాల్సి వస్తే, సరైన కారణాలను తెలియ జేస్తూ ఫిర్యాదుదారుకు లిఖిత పూర్వక సమాచారం ఇవ్వాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రైతులకు వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ధర్నా...

రైతులకు, కౌలు రైతులకు ఖరీఫ్‌ సీజన్‌లో రూ.2 లక్షల వడ్డీలేని రుణాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నాయకులు, రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు విత్తనాలు, క్రిమిసంహారక మందులు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. సీపీఐ జల్లా కార్యదర్శి రాజాన దొరబాబు, ఏఐఎస్‌ఎఎఫ్‌ జిల్లా కార్యదర్శి గొల్లు ఫణీంద్ర, వై.ఎన్‌. భద్రం, వియ్యపు రాజు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement