మాడుగుల: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ తల్లి పండగను జూన్ 2న ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయానికి రంగులు అద్ది ముస్తాబుచేయడంతో పాటు భారీ విద్యుత్ దీపాలు, సెట్టింగ్‌లతో ఆలయం నుంచి శతకం పట్టు వరకూ కళకళలాడుతోంది. సతకం పట్టు వద్ద తాటాకుల శాలతో పాటు చలువ పందిళ్లు వేశారు. పండగ సందర్భంగా అమ్మవారిని సుమారు లక్ష మంది భక్తులు దర్శించుకుంటారని భావిస్తున్నారు. భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు ఆలయకమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. పండగను వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. పండగ సందర్భంగా మోదకొండమ్మ విగ్రహాన్ని వెండి, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.పలు సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర నేలవేషాలు ప్రదర్శించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. 250 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహించనున్నారు. ఉత్సవం జరిగే ప్రాంతంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.భక్తుల వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘాట్‌రోడ్ నుంచి వచ్చే వాహనాలకు టీటీడీ కల్యాణమండపం వద్ద, ఎం. కోడూరు నుంచి వచ్చే వాహనాలకు అమ్మవారి ఆలయం వెనుక, చీడికాడ నుంచి వచ్చే వాహనాలకు తహసీల్దార్ కార్యాలయం వెనుక, సారగరం నుంచి వచ్చే వాహనాలకు మోదమాంబ కాలనీ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, ఎస్‌ఐ జి.నారా యణరావు మాట్లాడుతూ పండగలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అందరూ సహకరించాలని కోరారు.


