పండగకు వస్తానని.. తిరిగిరాని లోకాలకు | - | Sakshi
Sakshi News home page

పండగకు వస్తానని.. తిరిగిరాని లోకాలకు

Jun 1 2026 12:38 AM | Updated on Jun 1 2026 12:38 AM

ఎండాడ వద్ద రోడ్డు ప్రమాదంలో

ఆటో డ్రైవర్‌ మృతి

మృతుడు దేవరాపల్లి మండలం

పెదనందిపల్లి వాసి

దేవరాపల్లి/కొమ్మాది: పండగకు ఆదివారం వస్తానని చెప్పి...భార్య, పిల్లల్ని చీడికాడ మండలం మంచాలలోని ఆమె పుట్టింటికి శనివారం పంపించాడు. గంటల వ్యవధిలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆదివారం తెల్లవార జామున భర్త మరణ వార్తను ఫోన్‌ ద్వారా తెలుసుకున్న భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాపల్లి మండలం పెదనందిపల్లి శివారు సత్యనారాయణపురం కాలనీకి చెందిన పెనుగంటి నరసింహమూర్తి (34) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు.విశాఖలోని ఎండాడ సమీపంలోని ఓ వ్యక్తికి సంబంధించిన ఫర్నిచర్‌ను ఆటోలో ఎక్కించుకుని శనివారం రాత్రి బయలుదేరాడు. అదే సమయంలో కాశీ వెళ్తున్న కొందర్ని అదే ఆటోలో ఎక్కించుకుని రైల్వే స్టేషన్‌లో దించాడు. అక్కడి నుంచి ఆదివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో ఎండాడ వెళ్తుండగా ఎండాడ జంక్షన్‌ వద్ద సిరిగుడినగర్‌ వెళ్లేందుకు ఆటో యూటర్న్‌ తీసుకుంటుండగా.. పీఎంపాలెం వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రోడ్డుపై పడిన నరసింహమూర్తి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి భార్య మహేశ్వరి, కుమార్తె గుణశ్రీ, కుమారుడు ఉదయ్‌కిరణ్‌ ఉన్నారు. నర్సింహమూర్తి మృతితో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. పండగకు వస్తానని మమ్మల్ని పంపించి, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయవంటూ భార్య కన్నీరు మున్నీరుగా విలపించింది. పిల్లలను ఎలా పోషించాలంటూ ఆమె రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. స్వగ్రామంలో ఆదివారం కుటంబ సభ్యులు, బంధువుల ఆశ్రునయనాల మధ్య అంత్యక్రియలు జరిపారు.

Advertisement
 
Advertisement
Advertisement