● వార్ ఎఫెక్ట్..
● పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన విక్రయాలు
● ఆందోళనతో క్యూకడుతున్న వాహన దార్లు
నక్కపల్లి బంకులో స్టాక్ లేకపోవడంతో
ఏర్పాటు చేసిన స్లాపర్లు
పశ్చిమాసియాలో యుద్ధ పరిణామాల నేపథ్యంలో కొంతకాలంగా వంట గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న ప్రజలకు ఇప్పుడు ఇంధన కష్టాలు కూడా మొదలయ్యాయి. జిల్లాలో కొన్ని పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల పరిమితంగా పెట్రోల్ విక్రయిస్తున్నారు. పలు ప్రాంతాల్లో డీజిల్ కూడా దొరకడం లేదు. దీంతో వాహనదారులు పెద్దసంఖ్యలో బంకుల వద్ద బారులు తీరుతున్నారు. గతంలో బంకులకు క్రెడిట్‌పై పెట్రోలు, డీజిల్ సరఫరా చేసిన కంపెనీలు.. యుద్ధ పరిణామాల నేపథ్యంలో ఆ సౌకర్యాన్ని నిలిపివేశాయని సమాచారం. చాలాకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన బకాయిలు చెల్లించని బంకులకు కూడా సరఫరా ఆపేశాయని చెబుతున్నారు. దీనివల్ల కూడా కొరత ఏర్పడుతోందని తెలిసింది.
నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఉన్న బంకుల్లో పెట్రోలు కొరత ఏర్పడింది.బంకుల్లో నోస్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. వాహనాలు బంకుల్లోకి రాకుండా స్లాపర్లు ఏర్పాటు చేయడంతో వాహన యజమానుల్లో ఆందోళన మొదలైంది. నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం మండలాల్లో 15 పెట్రోలు బంకులు ఉన్నాయి. వీటిలో డీజిల్,పెట్రోలు లేదంటూ నోస్టాక్ బోర్డులు పెట్టేశారు.మండల కేంద్రం నక్కపల్లిలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బంకులో పెట్రోలు కొరత ఉందని తెలుసుకున్న వాహన యజమానులు క్యూకట్టారు. శనివారం ఉదయం డీజిల్ మాత్రమే విక్రయించారు. మధ్యాహ్నం నుంచి డీజిల్‌అమ్మకాలు నిలిపివేశారు.
బుచ్చెయ్యపేట: మండలంలోని పలు పెట్రోల్ బంక్‌ల్లో శనివారం రాత్రి నుంచి పెట్రోల్,డీజిల్ అమ్మకాలు నిలిపి వేశారు. లోపూడిలో కంపెనీ ఆధ్వర్యంలో నడుస్తున్న బీపీసీఎల్ బంక్‌లో సాయంత్రం నుంచి పెట్రోల్,డీజిల్ విక్రయాలు నిలిపివేశారు. వడ్డాదిలో ఉన్న నాలుగు బంక్‌లతో పాటు బుచ్చెయ్యపేట,రాజాంలో ఉన్న బంకుల్లో డీజిల్ అమ్మకాలు నిలిపివేశారు. కొన్ని బంకుల్లో పెట్రోల్ అమ్మకాలు చేయగా, కొన్ని బంకుల్లో పెట్రోల్,డీజిల్ అమ్మకాలు నిలిపివేశారు. దీంతో అత్యవసరంగా వెళ్లే వాహనదార్లు తీవ్ర వస్థలకు గురయ్యారు.
సాక్షి, అనకాపల్లి: జిల్లా వ్యాప్తంగా సుమారు 169 పెట్రోల్ బంకులు ఉండగా.. అందులో సగానికి పైగా జాతీయ రహదారిని అనుకుని పాయకరావుపేట నుంచి లంకెలపాలెం వరకూ ఉన్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న అనకాపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా రోజుకు సుమారు 2.5 లక్షల లీటర్ల పెట్రోల్ అమ్ముడవుతోంది. అదేవిధంగా రోజుకు సగటున 4.8 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. అనకాపల్లి ఒక పారిశ్రామిక హబ్ కావడంతో డీజిల్ వినియోగం చాలా ఎక్కువ ఉంటుంది. అచ్యుతాపురం ఎస్‌ఈజెడ్, పరవాడ ఫార్మా సిటీలలోని జనరేటర్లు, భారీ యంత్రాలు, సరుకు రవాణా వాహనాలకు ఈ ఇంధనం ప్రాణాధారంగా మారింది. దీంతో ఎక్కువగా డీజిల్ వినియోగం ఉంటుంది.
ధరల పెంపు భయం
ప్రస్తుతం జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయని మధ్యతరగతి ప్రజ లు బెంబేలెత్తుతున్నారు. కూరగాయలు, బియ్యం వంటి నిత్యావసరాల రవాణా భారమైతే సామాన్యుడి బతుకు బండి నడవడం కష్టమవుతుంది. అదేవిధంగా దీని ప్రభావం రైతుపై కూడా పడుతుంది. వరి కోతలు, పొలాల తయారీకి ట్రాక్టర్లు, హార్వెస్టర్ల వినియోగం తప్పనిసరి. డీజిల్ కొరత ఏర్పడితే సాగు పనులకు ఆటంకం కలుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కొరత లేదు
జిల్లాలోని సుమారు 169 బంకుల్లో కలిపి దాదాపు 18 లక్షల లీటర్ల పెట్రోల్, 35 లక్షల లీటర్ల డీజిల్ నిల్వలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం, పౌర సరఫరాల శాఖ అధికారులు చెబతున్నారు. ఈ నిల్వలు సాధారణ పరిస్థితుల్లో జిల్లా అవసరాలకు మరో 7 నుంచి 10 రోజులకు సరిపోతాయని అంచనా వేస్తున్నారు. చమురు సంస్థలు ప్రతిరోజూ తమ టెర్మినల్స్ నుంచి నిల్వలను పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై, నల్లబజారులో విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అనవసరంగా భయపడి స్టాక్ నిల్వ చేసుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
నక్కపల్లి బంకు వద్ద బారులు తీరిన కార్లు
డీజిల్ కొరత...
యలమంచిలి రూరల్: యలమంచిలి పట్టణం,మండలంలోని డీజిల్ కొరత వాహనదారులకు ఆందోళన కలిగిస్తోంది.రోజువారీ ఖాతాదారులకు లేదనకుండా డీజిల్ అందిస్తున్న బంకుల నిర్వాహకులు మిగిలిన వారికి పరిమితంగా మాత్రమే ఇంధనాన్ని అమ్ముతున్నారు.పట్టణంలో ఒక బంకు యజమాని మూడురోజుల క్రితమే డీజిల్ ఇండెంట్ పెట్టి దానికి అవసరమైన డబ్బుకు డీడీ చెల్లించినా ఇప్పటివరకు డీజిల్ పంపించలేదు. బైపాస్ రోడ్డులో ఉన్న మరో బంకులో రేషన్ పద్ధతిని అవలంభిస్తున్నారు.వచ్చిన వారికి 25 లీటర్ల నుంచి 50 లీటర్ల వరకు మాత్రమే డీజిల్ ఇస్తున్నారు.ఇక పెట్రోల్ విషయంలో మాత్రం శనివారం నాటికి ఎలాంటి కొరత లేదు.అడిగినంత పెట్రోల్ వాహనదారులకు అమ్ముతున్నారు. డీజిల్ కొరత మాత్రం వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తోంది.ఆదివారం స్టాకు రాకపోతే కొరత తీవ్రరూపం దాల్చనున్నట్టు సమాచారం. ఇంధన కొరతకు కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడంలేదని బంకుల యజమానులు చెబుతున్నారు.దీనికి యుద్ధ ప్రభావమా లేక మరేదైనా కారణమా అన్నది తెలుసుకునేందుకు బంకుల యజమానులు తంటాలు పడుతున్నారు.ఈ నెలాఖరుకు ధరలు పెరిగే అవకాశం ఉన్నందునే ప్రస్తుత కొరతకు కారణంగా కొందరు భావిస్తున్నారు.
మాడుగులలో
మాడుగుల: స్థానిక ఘాట్‌రోడ్ జంక్షన్‌లో ఉన్న పెట్రోల్ బంకు, జేడీపేట గ్రామం సమీపంలో ఉన్న బంకులో డీజిల్ నిండుకుంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.
బైక్‌కు రూ.500.. కారుకు రూ.1000
అనకాపల్లి: పెట్రోల్ కొరత వార్తల నేపథ్యంలో అనకాపల్లి పట్టణ, మండల పరిధిలోని ఆరు పెట్రోల్ బంకుల్లో వాహనాలకు పరిమితంగా పెట్రోల్, డీజిల్ వేస్తున్నారు. శనివారం బైక్‌కు రూ.500 వరకు, కారుకు రూ.వెయ్యి వరకూ మాత్రమే పెట్రోల్ వేశారు. అంతకు మించి పెట్రోల్ వేసేందుకు పలు బంకుల సిబ్బంది నిరాకరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిమితంగా పెట్రోల్ వేస్తున్నట్టు సమాచారం.
జిల్లాలో పలు చోట్ల నోస్టాక్ బోర్డులు
ఇంకొన్ని ప్రాంతాల్లో
పరిమితంగా విక్రయాలు
ఆందోళనలో వాహనదారులు
కొరత లేదంటున్న అధికారులు


