మహిళలను కించపరిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

మహిళలను కించపరిస్తే సహించం

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

కొత్త పలుకులు పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు

బహరంగ క్షమాపణ చెప్పాల్సిందే

లేకుంటే రాష్ట్రవాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం

వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి హెచ్చరిక

పాడేరు: మహిళా లోకాన్ని కించపరుస్తూ, సభ్య సమాజం తలదించుకునేలా ‘కొత్త పలుకులు’ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్‌సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. బుధవారం పాడేరులోని తన నివాసంలో పార్టీ మహిళా నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్నారని, కేవలం చంద్రబాబు నాయుడి మెప్పు కోసమే వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాళ్లను ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో సాక్షి కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసినప్పుడు గుర్తుకు రాని రాజ్యాంగ విలువలు, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే గుర్తుకు వస్తున్నాయా? అని ఆమె ప్రశ్నించారు. తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్‌’ (విశాఖ–విజయవాడ–గుంటూరు కారిడార్‌) అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, కేవలం రూ. 20 వేల కోట్లతో 110 కిలోమీటర్ల మేర రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ చర్చను పక్కదారి పట్టించేందుకే మహిళలపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అనంతరం రాధాకృష్ణ వైఖరికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ ఎస్టీ సెల్‌ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్‌పర్సన్‌ ఎం. సరస్వతి, మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షురాలు లకే రామసత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement