సింహాచలం: చందనోత్సవం సందర్భంగా భక్తులకు సేవలందించే స్వచ్ఛంద సంస్థలకు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, పోలీసులు, జీవీఎంసీ హెల్త్ విభాగం అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం పరిపాలన కార్యాలయంలో బుధవారం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె.వెంకటరావు మాట్లాడుతూ.. క్యూల్లో భక్తులకు ఆహార పదార్థాలు, పానీయాలు పంపిణీ చేసేటప్పుడు క్యూలను స్తంభింపజేయకూడదని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు పంపిణీ చేసే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యత సంబంధిత సంస్థదేనని.. ఏమాత్రం చెత్త పేరుకుపోయినా వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు సంస్థలను అక్కడి నుంచి పంపించివేస్తామన్నారు. చందనోత్సవం ప్రసాదాల పేరుతో కొన్ని సంస్థలు బయట చందాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి చక్రవర్తి మాట్లాడుతూ.. భక్తులకు అందించే ఆహారం నాణ్యంగా, వేడిగా ఉండాలని, ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వలంటీర్లు తప్పనిసరిగా చేతి గ్లౌజులు ధరించాలన్నారు. జీవీఎంసీ అధికారి రాజారావు కుమార్ మాట్లాడుతూ.. ఆహార పంపిణీలో ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని, కేవలం పర్యావరణహిత వస్తువులనే వినియోగించాలని తెలిపారు. గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ.. అనుమతి పొందిన సంస్థల ప్రతినిధులను మాత్రమే జాబితా ప్రకారం స్టాళ్ల వద్దకు అనుమతిస్తామని, వాహన పాసులను కూడా రికార్డులు పరిశీలించిన తర్వాతే జారీ చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అడవివరం ఆరోగ్య కేంద్రం డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి, దేవస్థానం ఎస్‌డీసీ మధులత, సూపరింటెండెంట్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.


