అనకాపల్లి: మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు బుధవారం విశాఖ వెళుతున్న వైఎస్సార్‌సీపీ అనకాపల్లి నాయకులను పట్టణ పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అన్నారు. స్థానిక ఉడ్‌పేట నుంచి వైఎస్సార్‌సీపీ నాయకులు విశాఖకు వెళుతున్న సమయంలో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, వెళితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసన తెలపకుండా పోలీసులతో అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన నీచపు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జె.రమేష్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 84వ వార్డు ఇన్‌చార్జి కె.రాఘవ, 82వ వార్డు ఇన్‌చార్జి అల్లు త్రినాథ్, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిన అప్పారావు, కోన ఉమా, లక్కోజు రాంబాబు, తంగేళ్ల రామకృష్ణ, చింతా రాంజీ, రేబాక స్వామి, సత్తిబాబు, కొంకీ శ్రీరాంమ్మూర్తి,గుండా రమేష్ గుప్తా, కాండ్రేకుల శ్రీనివాసరావు,సతీష్ రెడ్డి, దేశెట్టి బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


