మహారాణిపేట(విశాఖ): గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కార్యకలాపాలపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలు, డి.ఆర్.డిపోలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గిరిజనుల వద్ద సేకరించిన ఉత్పత్తులకు ఆన్‌లైన్ ద్వారా నగదు జమ చేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, కాఫీ కొనుగోళ్లు పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెంచే దిశగా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జీసీసీలో పనిచేస్తున్న 33 మంది సేల్స్‌మెన్‌కు జూనియర్ అసిస్టెంట్‌లుగా పదోన్నతులు కల్పిస్తూ, వారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్, మేనేజింగ్ డైరెక్టర్ శోభిక, పలువురు అధికారులు పాల్గొన్నారు.


