అనకాపల్లి: దేవరాపల్లి పీహెచ్‌సీ పరిధిలో గర్సింగి గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీ రాజ్యలక్ష్మి ఆత్మహత్యా యత్నానికి కారకులైన హెల్త్ సూపర్‌వైజర్ పుష్పరాజ్‌ను వెంటనే అరెస్టు చేసి విధులు నుంచి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు మాట్లాడారు. డబ్బు మదంతో పుష్పరాజు బెదిరింపులు చేసి తోటి ఉద్యోగులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించారు. అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడటంతోపాటు మహిళా ఉద్యోగులపై శారీరకంగా మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో కొనసాగించటానికి వీలులేదన్నారు. ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, గిరిజన సమాఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకుడు రాధాకృష్ణ, శ్రామిక మహిళా నాయకురాలు నారాయణమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ ఇతర ఆరోగ్య సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న హెల్త్ సూపర్‌వైజర్ పుష్పరాజుపై మండల అభివృద్ధి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఆగడాలు మరింత మితిమీరుతున్నాయని ఆరోపించారు. గిరిజనురాలైన రాజ్యలక్ష్మిని కులదూషణతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆత్మహత్యకు యత్నించి పాడేరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వాపోయారు. ఘటనపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తుగా అనారోగ్యం పేరుతో హాస్పిటల్‌లో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. చర్యలు తీసుకోని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు.


