అనకాపల్లి : కరోన వంటి విపత్తుల తరువాత మానవుని జీవనశైలిలో అనేక మార్పులు సంభవించాయని, రహదారులపై జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వివిధ రకాలైన వ్యాధులు బారినపడే అవకాశాలు ఉన్నాయని డీఎంహెచ్‌వో ఎం.హైమావతి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రభుత్వం ‘ఆరోగ్యానికి కలిసికట్టుగా–విజ్ఞానానికి అండగా నిలబడదాం’ నేపథ్యం పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి క్రీడామైదానం వరకూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగులు కలిసిన ఆహారం, రసాయనాలతో మాగబెట్టిన మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లుని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని, సహాజసిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం, రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, డీసీహెచ్‌ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్‌దేవ్, వైద్యు సిబ్బింది తదితరులు పాల్గొన్నారు.


