సెజ్‌ హామీ.. నెరవేరదేమీ? | - | Sakshi
Sakshi News home page

సెజ్‌ హామీ.. నెరవేరదేమీ?

Apr 2 2026 7:35 AM | Updated on Apr 2 2026 7:35 AM

రెండు జిల్లాల రైతులకు మేలన్నారు..

ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు...

గాంధీనగరంలో 100 ఎకరాలు కేటాయించాలని

అధికారులను ఆదేశించారు...

15 నెలలు గడిచినా ఆచరణలో విఫలం

స్పీకర్‌ హామీలు అమలు కాని వైనం

నాతవరం: స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు గాంధీనగరం సమీపంలో ఎస్‌ఈజెడ్‌ (సెజ్‌) ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా నేటికీ అమలు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబరులో నర్సీపట్నం తుని మధ్య అర్‌అండ్‌బీ రోడ్డు పనులకు భూమి పూజ చేసేందుకు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, కలెక్టర్‌ విజయకృష్ణన్‌ విచ్చేశారు. కార్యక్రమం అనంతం ఏర్పాటు చేసిన సభలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గాంధీనగరం ప్రాంతంలో ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేస్తానన్నారు, నర్సీపట్నం, తుని మధ్య అర్‌అండ్‌బీ రోడ్డును అనుకుని గాంధీనగరం ప్రాంతంలో 100 ఎకరాలు తక్కువ లేకుండా భూమి సేకరిస్తే సీఎం చంద్రబాబుతో మాట్లాడి సెజ్‌ ఏర్పాటు చేస్తానని కలెక్టర్‌ సమక్షంలో హామీ ఇచ్చారు. ఇక్కడ ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేసిన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు పండించే వ్యవసాయ ఉత్పత్తులను ఇక్కడకు తరలిస్తామన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ సెజ్‌ ఏర్పాటు చేయడం వల్ల అనకాపల్లి జిల్లాలో మైదాన ప్రాంత రైతులతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో గిరిజనులు పండించే అన్ని రకాల ఉత్పత్తులకు గిరాకీ ఉండే విధంగా చేసుకోవచ్చునన్నారు. మైదాన ప్రాంత రైతులకు తోడు గిరిజన ప్రాంత రైతుల ఉత్పత్తులను సెజ్‌లో నిల్వ చేసి, ఇతర మార్కెట్లకు తరలిస్తే అధిక ఆదాయం వస్తుందని ఊరించారు. మన ప్రాంతంలో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలలో గిరాకీ ఉందన్నారు. అక్కడ మార్కెట్లో ప్రజలకు అనుగుణంగా ఉండే విధంగా ఆయా ఉత్పత్తులు తయారు చేసేందుకు సెజ్‌ ఎంతో ఉపయోడపడుతుందన్నారు. గాంధీనగరం ప్రాంతంలోనే ఎస్‌ఈజెడ్‌ ఏర్పాటు చేయడం వల్ల ఉత్పత్తులను తుని రైల్వే స్టేషన్‌కు, జాతీయ రహదారికి, విశాఖపట్నం ఎయిర్‌పోర్డుకు తరలించేందుకు రవాణాతో పాటు రోడ్డు మార్గం బాగుంటుందన్నారు. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సభలో ఇచ్చిన హామీ మేరకు అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు ఎన్‌.దినేష్‌కుమార్‌, విజయ్‌కృష్ణన్‌ 2025 ఫిబ్రవరి 17న గాంధీనగరం ప్రాంతంలో భూములను స్వయంగా పరిశీలించారు. ఇక్కడ సెజ్‌ ఏర్పాటుకు 100 ఎకరాలకు పైగా భూమి కావాలి. అందులో ప్రభుత్వ భూమి ఎంత ఉంది, జిరాయితీ భూమి ఎంత, డీఫారం భూమి ఎంత? అనే విషయమై క్షేత్ర స్థాయి పరిశీలన చేశారు. ఇక్కడ సెజ్‌ ఏర్పాటుకు అవసరమైన భూమి సేకరణ చేయాలని ఇద్దరు కల్టెక్టర్లు నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణను ఆదేశించారు, గాంధీనగరం సమీపంలో అధికంగా పెడిమికొండలో అటవీశాఖకు చెందిన భూములు ఉన్నాయి. అటవీశాఖ భూములు తీసుకుంటే దానికి బదులుగా ఇదే మండలంలో సరుగుడు సుందరకోట ప్రాంతంలో వేలాది ఎకరాలు గ్యాప్‌ ఏరియా భూములు ఉన్నాయి. వాటిలో కొంత భూమి అటవీశాఖకు ఇచ్చేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడ సెజ్‌ ఏర్పాటు చేయడం వల్ల మైదాన, ఏజెన్సీ ప్రాంత వ్యవసాయ రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పీకర్‌ స్వయంగా ప్రకటించారు. ఇలా ప్రజలకు ఆశ చూపించి 15 నెలలు గడుస్తున్నా సెజ్‌ ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement