ఉపాధ్యాయుల జీతాలు మన రాష్ట్రంలోనే అధికం
నాతవరం: ఉపాధ్యాయులకు ఒడిశా రాష్ట్రంలో కంటే మన రాష్ట్రంలోనే రెట్టింపు జీతాలు ఇస్తున్నామని అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండలం వెదురుపల్లిలో శనివారం ఆయన సామాజిక పింఛన్లు పంపిణీ చేసి, గుమ్మడిగొండ నుంచి నాతవరం మధ్య రూ.80 లక్షల వ్యయంతో తారురోడ్డు, నాతవరం నుంచి తాండవ వరకు, రూ.3.5లక్షలతో తారురోడ్డు నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నాతవరం గ్రామంలో స్వచ్ఛ రఽథానికి జెండా ఊపి ప్రారంభిచారు. ఈసందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు మన రాష్ట్రంలో నెలకు రూ. లక్షకు తక్కువ లేకుండా జీతం ఇస్తున్నామని, భార్యాభర్తలు ఇద్దరు ఉపాధ్యాయులు అయితే సీనియారిటీని బట్టి రూ.రెండు లక్షలకు పైగా ఇద్దరికి జీతం వస్తుందన్నారు.
ఇంత వస్తున్నా కొంతమంది ఉపాధ్యాయులు యూనియన్లు పేర్లు చెప్పి, మావద్ద ఉపాధ్యాయులు ఇంతమంది ఉన్నారని ఎన్నికల సమయంలో డబ్బులిస్తే ఓట్లు వేస్తామని నావద్దకు వచ్చారన్నారు. ఒడిశా రాష్ట్రంలో సీనియారిటీ ఉన్న ఉపాధ్యాయుడికి నెలకు రూ 50వేలు ఇస్తున్నారని చెప్పారు. పింఛన్లు విషయానికి వస్తే మనం నెలకు రూ.4వేలు ఇస్తే గుజరాత్‌లో ప్రధానమంత్రి సొంత రాష్ట్రంలో నెలకు రూ.750 ఇస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలు విడతల వారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. తాండవ రిజర్వాయర్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. నాతవరం, గొలుగొండ మండలాలు సరిహద్దు తాండవ ఘాట్‌రోడ్డు రక్షణ గోడ నిర్మాణం త్వరలో చేస్తానని హమీచ్చారు. ఈకార్యక్రమంలో ఆర్‌అండ్‌బీ ఇరిగేషన్ ఈఈలు ఎన్.సాంబశివరావు, బాలసూర్యం, డీఈలు విద్యాసాగర్, అనురాధ, జెఈలు శ్యామ్‌కుమార్, నారాయణరెడ్డి, నాయుడుబాబు, ఎంపీడీవో శ్రీనివాస్, తాండవ ప్రాజక్టు చైర్మన్ కె.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


