ప్లేట్లు కడిగితేనే భోజనం
యలమంచిలి రూరల్:అన్న క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం,అల్పాహారం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో క్యాంటీన్ల నిర్వహణను గాలికొదిలేసింది.వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి తనిఖీలు చేస్తుండడంతో క్యాంటీన్లలో పనిచేసే సిబ్బంది భోజనానికి వచ్చే వారిపై దురుసుగా ప్రవర్తించడం, దౌర్జన్యానికి తెగబడడం చేస్తున్నారు.ఆహార పదార్థాల వడ్డనలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భోజనం,అల్పాహారం తిన్న తర్వాత ఎవరి ప్లేట్లు వారే కడగాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరైనా ప్లేట్లు కడగకపోతే వారిపై అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. యలమంచిలి పట్టణంలో అన్న క్యాంటీన్‌కు శనివారం మధ్యాహ్న భోజనానికి వెళ్లిన 10 మంది ఇంటర్మీడియెట్ విద్యార్థులపై అక్కడ పనిచేసే సిబ్బందిలో కొందరు దురుసుగా ప్రవర్తించారు.ఇద్దరు విద్యార్థులను క్యాంటీన్‌లోకి రానిచ్చేది లేదంటూ ఆహారపదార్థాలు ప్లేట్లో పెట్టించుకోవడానికి క్యూలైన్లో నిల్చున్న విద్యార్థుల చేతిలో ప్లేట్లను అక్కడ పనిచేసే సిబ్బంది లాక్కున్నారు.వారిలో ఒక విద్యార్థిని సిబ్బందిలో ఒకరు చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లి నీకు ఇక్కడ భోజనం పెట్టేదిలేదని ఖరాకండీగా చెప్పి,ఇంకెప్పుడూ క్యాంటీన్‌లోకి రానివ్వనని హెచ్చరించాడు. రెండు రోజుల క్రితం విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ప్లేట్లు కడగకపోవడం,ప్లేట్లు కడగమంటున్నారని గతంలో ఇద్దరు విద్యార్థులు స్థానిక మున్సిపల్ కమిషనర్‌కు మౌఖికంగా ఫిర్యాదు చేయడమే క్యాంటీన్‌లో సిబ్బంది ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.బాధిత విద్యార్థులందించిన వివరాలివి..పట్టణంలో ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రశాంత్‌కుమార్,మదన్‌కుమార్, శెన్నంసెట్టి దుర్గాప్రసాద్,విజయ్ దుర్గాప్రసాద్, విజయ్‌రాజు, శివమణికంఠ, గోపీచంద్, లోకేష్,మోహన్,లక్ష్మీప్రసాద్‌లు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో యలమంచిలి కొమ్మాయిగుండం చెరువు సమీపంలో ప్రధాన రహదారి పక్కనున్న అన్న క్యాంటీన్‌కు భోజనం చేయడానికి వెళ్లారు.ఒక్కొక్కరూ రూ.5 చెల్లించి భోజనం టోకెన్ తీసుకుని ప్లేట్లు పట్టుకుని భోజన పదార్థాలు తీసుకోవడానికి క్యూలైన్లో నిల్చున్నారు.
ఆ సమయంలో అక్కడ పనిచేసే సిబ్బందిలో ఒక యువకుడు విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తూ,అవమానపరిచేలా మాట్లాడాడు.విద్యార్థుల్లో లోకేష్,దుర్గాప్రసాద్ చేతిలో ప్లేట్లు లాక్కొని దుర్గాప్రసాద్ చొక్కా కాలర్ పట్టుకుని క్యాంటీన్ నుంచి బయటకు లాక్కెళ్లాడు.
మీకు ఇక్కడ అన్నం పెట్టేదిలేదంటూ అక్కడ భోజనం చేస్తున్న సుమారు 50 మంది సమక్షంలో అవమానకరంగా మాట్లాడాడు.భోజనం చేసిన తర్వాత ప్లేట్లు కడగకపోతే ఎవరికై నా మా ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుందని హెచ్చరించాడు.
ఈ ఘటనతో తీవ్ర అవమాన భారంతో విద్యార్థి దుర్గాప్రసాద్ చేసేదిలేక అక్కడి నుంచి ఆకలితోనే వెళ్లిపోవాల్సి వచ్చింది.ఈ రాద్ధాంతమంతా ఆ విద్యార్థులు కొద్ది రోజుల క్రితం అన్నక్యాంటీన్‌లో భోజనం చేసిన తర్వాత ప్లేట్లు కడగకపోవడమే.ఇందుకు ఆ విద్యార్థులను అవమానపరిచేలా అక్కడ సిబ్బంది ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
కమిషనర్,పోలీసులకు ఫిర్యాదు
తమకు జరిగిన అవమానం,అన్యాయం గురించి బాధిత విద్యార్థులు యలమంచిలి మున్సిపల్ కమిషనర్,పట్టణ పోలీసులకు శనివారం సాయంత్రం రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఇప్పటికై నా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
ప్లేట్లు కడగాలన్న నిబంధన ఏదీ లేదు
అన్నక్యాంటీన్లలో ప్లేట్లు కడగడానికి సిబ్బందిని నియమించారు.కానీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా యలమంచిలి అన్న క్యాంటీన్‌లో మాత్రమే భోజనం,అల్పాహారం తీసుకోవడానికి వచ్చిన వారితో బలవంతంగా ప్లేట్లు కడిగిస్తున్నారు. ఎవరైనా భోజనం తిన్న తర్వాత ప్లేటు కడగకుండా వెళ్లిపోతే వారిని వెనక్కు పిలిచి మరీ అక్కడి సిబ్బంది కడిగిస్తున్నారు. క్యాంటీన్‌లో భోజనం చేసిన తర్వాత ప్లేట్లు కడగనవసరం లేదని అధికారులు బోర్డు సైతం ఏర్పాటు చేశారంటే ఆ సమస్య తీవ్రత ఇట్టే అర్థమవుతుంది.
అవమానరిచే హక్కు ఎవరిచ్చారు?
ఈ నెల 22వ తేదీన మధ్యాహ్న భోజనం చేయడానికి అన్న క్యాంటీన్‌కు వెళ్లాను.భోజనం చేసిన తర్వాత ప్లేటు కడగకుండా వచ్చేస్తుంటే అక్కడ పనిచేసే మహిళ నన్ను తిట్టింది. అదేమిటని అడిగితే అక్కడ పనిచేసే మరికొంత మంది మాపై తిరగబడ్డారు.ఇది చూస్తున్నవారంతా మేమే ఏదో తప్పు చేశామనుకుంటున్నారు.మమ్మల్ని అవమానపరిచే హక్కు అక్కడ సిబ్బందికి ఎవరిచ్చారు. – గోపీచంద్, బాధిత విద్యార్థి
దౌర్జన్యం చేస్తున్నారు
భోజనం చేయడానికి వెళ్తే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తున్నారు.ప్రభుత్వం మాకు భోజనం చేసే అవకాశాన్ని కల్పించినా పనిచేసే సిబ్బంది ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు.ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండని నిర్భయంగా చెబుతున్నారు.ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థంకావడం లేదు.అధికారులు చర్యలు తీసుకుని నాకు న్యాయం చేయాలి. – దుర్గాప్రసాద్, బాధిత విద్యార్థి
క్యాంటీన్‌లోకి రావద్దంటున్నారు
ప్లేట్లు కడగపోతే అదేదో మహా అపరాధం చేసినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అవమానకరంగా మాట్లాడుతున్నారు.అందరూ ప్లేట్లు కడుగుతూ ఉంటే మీరెందుకు ప్లేట్లు కడగరని,ప్లేట్లు కడగకపోతే క్యాంటీన్‌లోకి రావద్దని వార్నింగ్ ఇస్తున్నారు.ప్లేట్లు కడగవద్దని అక్కడ బోర్డు కూడా పెట్టారు.అయినా సిబ్బంది బలవంతంగా ప్లేట్లు కడగాలని హుకుం జారీ చేస్తున్నారు. – లోకేష్, విద్యార్థి
ప్లేట్లు కడిగితేనే భోజనం
ప్లేట్లు కడిగితేనే భోజనం
ప్లేట్లు కడిగితేనే భోజనం
ప్లేట్లు కడిగితేనే భోజనం
ప్లేట్లు కడిగితేనే భోజనం


