అప్పుల భారం తప్ప.. అభివృద్ధి లేదు
చంద్రబాబు ప్రభుత్వం చేసింది శూన్యం
మాజీ డిప్యూటీ సీఎం, పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలునాయుడు
మాడుగుల రూరల్: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత పెద్ద ఎత్తున అప్పులు చేయడం తప్ప, చేసిన అభివృద్ధి ఏమీ లేదని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు బూడి ముత్యాలునాయుడు విమర్శించారు. మాడుగులలో పార్టీ నాయకులతో కలిసి ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు.రాష్టంలో చంద్రబాబు ప్రభుత్వం గడిచిన 19 నెలల్లో చేసిన అభివృద్ధి ఏమీలేదని, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పనులను ప్రారంభిస్తున్నారని తెలిపారు. తన హయాంలో మాడుగుల నడిబొడ్డున్న రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన పంచాయతీరాజ్ అతిథిగృహం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి పాలన సాగిస్తున్నా రని చెప్పారు. 2024 డిసెంబరులో వడ్డాది నుంచి తాటిపర్తి వెళ్లే రహదారి పనులకు కలెక్టరు ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి, శిలాఫలకం వేశారని, అయితే ఈ రహదారి పనులు ఇటీవల వారం రోజులు క్రితం ప్రారంభమయ్యాయని చెప్పారు. తన హయాంలో ఘాట్‌రోడ్డు నుంచి కింతలి వరకు రహదారి నిర్మించామని తెలిపారు. మాడుగుల దేవీ ఆలయం నుంచి సాగరం, డి.గొటివాడ రహదారి, తాచేరు నది మీద వంతెనను రూ.7.50 లక్షలతో నిర్మించామని చెప్పారు. పెద్దేరు ఆధునికీకరణకు గత ప్రభుత్వంలో రూ.90 కోట్ల మంజూరు చేశామన్నారు. తమ హయా ంలో మంజూరు చేసిన నిధులు రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలిచారని ముత్యాలునాయుడు తెలిపారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, బస్సుల సంఖ్య పెంచకపోవడంతో మహిళలతో పాటు విద్యార్థులు అవస్థలు పడుతున్నారని చెప్పారు. దీపం పథకం పూర్తిగా నీరుగారిందని ఆరోపించారు. తల్లికి వందనం పథకం సక్రమంగా అమలుకాలేదన్నారు. హామీలు అమలు చేయ లేనిచంద్రబాబు, పవన్ కల్యాణ్ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.స్థానిక ఎంపీపీ వెంకటరాజారామ్, వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి, ఎం.కోడూరుసర్పంచ్ సంజీవరావు పాల్గొన్నారు.


