ఆర్‌ఎంపీ వైద్యుడి అవయవ దానం
నర్సీపట్నం: సమాజంలో అవయవదానంతో వందల మంది ఆయుష్షు పెంచుకుంటున్నారు. ఆర్‌ఎంపీ డాక్టర్ తాను చనిపోయి అవయవదానంతో ఇద్దరికి ప్రాణం పోసి సజీవుడిగా నిలిచారు. నర్సీపట్నం మండలం, చెట్టుపల్లి గ్రామానికి చెందిన మేడిశెట్టి రాజు (51) ఆర్‌ఎంపీ డాక్టర్‌గా సేవలు అందిస్తూ జీవనం సాగిస్తున్నారు. అనారోగ్యానికి గురికావడంతో నాలుగు రోజుల క్రితం విశాఖపట్నంలోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. వైద్యం పొందుతూ నవంబర్ 30న బ్రెయిన్ డెడ్‌కు గురయ్యారు. వైద్యుల సూచన మేరకు మృతుడి అవయవాలు దానం చేసేందుకు పుట్టెడు దుఖంలో ఉన్న మృతుడు భార్య వరలక్ష్మి, కుమార్తె విజయదుర్గ, కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో పేషెంట్‌కు లివర్ అమర్చారు. తిరుపతిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె అమర్చారు. రాజు మృతి చెందినా కొందరిలో జీవిస్తున్నాడని వారి కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. బతికి ఉన్నన్నాళ్లు ఆర్‌ఎంపీ డాక్టర్‌గా రాజు వైద్య సేవలు అందిస్తూ చనిపోయి అవయవదానంతో ఇద్దరిలో సజీవుడిగా నిలిచారు. రాజు మృతదేహాన్ని స్వగ్రామం తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.


