క్షేత్ర స్థాయి పర్యటనతో అర్జీల పరిష్కారం
● కలెక్టర్ విజయ కృష్ణన్
● పీజీఆర్‌ఎస్‌కు 276 అర్జీలు
తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ(పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సంబంధిత జిల్లా అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్‌ఎస్‌లో ఆమెతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 276 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులతో అధికారులు నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కరించిన అర్జీ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలని, పరిష్కారం కాని అర్జీల గురించి కారణాలు స్పష్టంగా వివరించాలన్నారు. దీని వల్ల అర్జీలు రీఓపెన్ కాకుండా నివారించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి వి.సుధీర్, జిల్లా సర్వే, భూ రికార్డుల భద్రత సహాయ సంచాలకుడు గోపాలరాజా, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఇళ్ల కేటాయింపుల్లో సిఫార్సులకు ప్రాధాన్యం
అర్హులైన దళితులందరికీ ఇళ్లు కేటాయించకుండా రాజకీయ సిఫార్సులు ఉన్నవారికే సచివాలయ సిబ్బంది మంజూరుకు జాబితా సిద్ధం చేస్తున్నారని రాంబిల్లి మండలం దిమిలికి చెందిన దళితులు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. అనేక మంది అర్హులు ఉన్నప్పటికీ ఎంపీటీసీ సిఫార్సు చేసిన 18 మంది పేర్లు మాత్రమే నమోదు చేసి, మిగతా వారికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని విదసం (విస్తృత దళిత సంఘాల)ఐక్య వేదిక జిల్లా ఉపాధ్యక్షుడు పాము నాగభూషణం, సహాయ కార్యదర్శి పాము గణేష్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు టేకు జోగారావు, రేబాక విజయ్ భాస్కరరావు, మాదల శివ గణేష్, కొమ్ము చిన్నారావు, మల్లమట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
అక్రమ నిర్మాణాల కోసం
నగదు వసూళ్లపై ఫిర్యాదు
అక్రమ నిర్మాణాల తొలగింపుపై లోకాయుక్తాలో కేస్ నెం.884–203/బీ1 విచారణలో ఉన్నప్పటికీ అక్రమాలను సక్రమం చేస్తామంటూ నగదు వసూళ్లకు పాల్పడుతున్న కూటమి నాయకులతో కుమ్మక్కెన సచివాలయ డిజిటల్, ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకోవాలని అనకాపల్లి మండలం బవులువాడ–దర్జినగర్‌కు చెందిన కె.సత్తిబాబు కలెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు. బవులువాడ సర్వే నంబర్ 4లో 40 అక్రమ కట్టడాలు, సర్వే నంబర్ 75లో 45 అక్రమ కట్టడాలు జరిగాయని, వాటిపై చర్యలు కోరుతూ లోకాయుక్త కేసు ఉందని, కలెక్టర్ విచారణకు ఆదేశించి తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చట్ట పరిధిలో సమస్యలకు వారంలో పరిష్కారం
అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 70 అర్జీలు అందాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీలు స్వీకరిస్తూ సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల అర్జీలు ఎక్కువగా భూసమస్యలపై వస్తున్నాయని, వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. భూ తగాదాలు–32, కుటుంబ కలహాలు–5, మోసానికి సంబంధించిన–2, వివిధ విభాగాలకు చెందినవి–31 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయి పర్యటనతో అర్జీల పరిష్కారం


