ఉల్లాసంగా ..ఉత్సాహంగా..
ఏయూక్యాంపస్: విశాఖ నగరం ఉదయాన్నే ఉత్సాహంగా పరుగు తీసింది. ప్రజలు చలిని లెక్కచేయకుండా ఆరోగ్య స్పృహతో పరుగులో పాల్గొన్నారు. సంధ్య మైరెన్ వైజాగ్ మారథాన్ నాల్గవ ఎడిషన్ విజయవంతంగా జరిగింది. వైజాగ్ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వేదికగా నిర్వహించిన ఈ మారథాన్ నగర ప్రజలలో పెరుగుతున్న ఆరోగ్య అవగాహనను ప్రతిబింబించింది. ఉదయం 5 కె పరుగు పోటీని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని సూచించారు. నిత్యం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలని అన్నారు. విశాఖ నగరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, ఆదరణ లభించడం మంచి పరిణామమని తెలిపారు. 32 కిలోమీటర్లు, ఇరవై ఒక్క కిలోమీటర్లు, పది కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్లు అనే నాలుగు విభాగాలుగా నిర్వహించిన పోటీలలో వేలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. జుంబా సెషన్, ఫిట్నెస్ శిక్షణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేవలం విశాఖ వాసులే కాకుండా దేశ నలుమూలల నుంచి రన్నర్స్ పాల్గొనడం, కొంత మంది విదేశీయులు సైతం ఉత్సాహంగా వైజాగ్ మారథాన్‌లో భాగమయ్యారు. కార్యక్రమంలో సీఎంఆర్ సంస్థల చైర్మన్ మావూరి వెంకట రమణ, సంధ్య మైరెన్ డైరెక్టర్ కె. ఆనంద్, అపోలో హాస్పిటల్స్ సీఈవో డాక్టర్ కృష్ణ ప్రసాద్, దివీస్ లాబొరేటరీ జీఎం ప్రద్యుమ్న, నోవాటెల్ నిర్వాహకులు ప్రభు కిషోర్, శ్రీ కన్య స్టీల్స్ ఎం.డి శ్రీనివాజ్ తదితరులు రన్నర్స్‌ను అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి, విజేతలకు ప్రశంసా పత్రాలు, మెడల్స్‌ను బహూకరించారు.
ఉల్లాసంగా ..ఉత్సాహంగా..


