బోటు కదలక.. పూట గడవక..
● చేపల వేట జరగక జాలర్లకు ఇబ్బందులు
● తాండవ జలాశయంలో
భారీగా నీటి నిల్వలు
● వేట సాగించలేక మత్స్యకారుల ఇక్కట్లు
నిండుకుండలా ఉన్న
తాండవ జలాశయం
గొలుగొండ: తాండవ జలాశయంలో చేపల వేటకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వలలు వేసినా చేపలు చిక్కడంలేదని జాలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు నెల రోజులుగా ఇదే పరిస్థితి రావడంతో తాండవ జలాశయంలో చేపల వేట సాగిస్తున్న మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా జలాశయంలో బాగా నీరు చేరడంతో చేపల వేట సాగడం లేదు. నాతవరం, గొలుగొండ మండలాలకు చెందిన 450 మంది జాలర్లకు తాండవ జలాశయమే జీవనోపాధి కల్పిస్తోంది. స్వదేశీ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో లైసెస్సులు ఉన్న సభ్యులతోపాటు లైసెన్సు లేని వారు సైతం జలాశయంలో చేపల వేట సాగిస్తుంటారు. కానీ ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా జలాశయం నిండుగా ఉండటంలో వేట సాగక ఇబ్బందులు వస్తున్నాయి. ప్రధానంగా తాండవ జలాశయం పరివాహక ప్రాంతాలైన జాలర్లపేట, పొగచెట్లపాలెం, వెంకటాపురం, సాలికమల్లవరం, అమ్మపేట, గాదంపాలెం తదితర గ్రామాల్లో ఉన్న జాలర్లు ఇబ్బందులు పడుతున్నారు. వీరికి చేపల వేట తప్ప వేరే పని తెలీదు.
జలాశయం నిండుగా..
తాండవ జలాశయం మత్స్య సంపదకు ఆలవాలం. ఈ సీజన్‌లో జాలర్ల పంట పండేది. ఈ ఏడాది జులై నెలాఖరు వరకు రొయ్యల వేట బాగా సాగింది. తరువాత రొయ్యల వేట నిలిపివేసి చేపల వేట ప్రారంభించారు. అక్టోబర్ చివరి వరకు చేపల వేట సాగిన తరువాత భారీ వర్షాల కారణంగా జలాశయం ఒక్కసారిగా నీటితో నిండిపోయింది. దీని కారణంగా వేటకు వెళితే చేపలు చిక్కడం లేదని జాలర్లు ఆవేదన చెందుతున్నారు. జలాశయంలో నీరు తగ్గితే తప్ప చేపలు చిక్కవని ఆవేదన చెందుతున్నారు. ఐదు సంవత్సరాలు తరువాత ఇటువంటి పరిస్థితి వచ్చిందని అంటున్నారు. బోట్లు ఒడ్డుకే పరిమితమయ్యాయి.
వేట సాగలేదు
నెల రోజుల నుంచి వేట సాగక ఇబ్బందులు పడుతున్నాం. భారీ వర్షాలే ఇందుకు కారణం. అక్టోబర్‌లో తుపాను ప్రభావం కారణంగా గెడ్డలు పొంగి తాండవ జలాశయానికి నీరు చేరింది. దీని కారణంగా తాండవ జలాశయం పూర్తిగా నిండి ప్రమాదస్థాయి స్థాయికి చేరింది. ఈ పరిస్థితుల్లో చేపల వేట కష్టంగా ఉంది. అందుకే బోట్లు ఒడ్డుకు పరిమితమవుతున్నాయి. గతంలో రోజుకు 500 నుంచి 800 రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఇప్పుడు కనీసం రెండు వందలు కూడా రావడం లేదు.
– లోవ, మల్లవరం, మత్స్యకారుడు
బోటు కదలక.. పూట గడవక..
బోటు కదలక.. పూట గడవక..


