ప్రారంభించకుండానే వెళ్లిపోయిన హోంమంత్రి అనిత
మరోవైపు రెండేళ్లుగా సాగుతున్న పథకం పనులు
కోట్లాది రూపాయల పనులపై కొరవడిన పర్యవేక్షణ
మిగిలిన గ్రామాల్లో తీసికట్టుగా పనులు
తేడా వస్తే బిల్లులు చెల్లించం
గ్రామాల్లో జల్ జీవన్ మిషన్ పనులు దశలవారీగా చేపట్టాం. ఇప్పటివరకు 50 శాతం పూర్తయ్యాయి. వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాం. బిల్లులు ఆలస్యం కావడం వల్ల పనులు నెమ్మదించాయి. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. తేడాలు వస్తే బిల్లులు చెల్లించబోం. హోంమంత్రి ప్రారంభోత్సవం నిలిపివేసిన ట్యాంకుకు మూడు రోజుల్లో సరి చేసే విధంగా చర్యలు తీసుకున్నాం.
–ఆనంద్, డీఈ, ఆర్‌డబ్ల్యూఎస్, పాయకరావుపేట
కాంట్రాక్టరు నిర్లక్ష్యం
జల్ జీవన్ మిషన్‌లో భాగంగా రెండో విడతగా 2023లో తిమ్మాపురానికి రూ. 88 లక్షలు, గోకులపాడుకు రూ. 68 లక్షలు, కోనవానిపాలెం గ్రామానికి రూ. 28 లక్షలు చొప్పున విడుదలయ్యాయి. ఈ నిధులతో పనులు ప్రారంభించినప్పటి నుంచి కాంట్రాక్టరు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ట్యాంకు నిర్మించిన తర్వాత కనీసం తడపడం లేదు. దీన్ని ప్రారంభించిన వెంటనే లీకులు వచ్చే పరిస్థితి ఉంది. పైపులైనులో సక్రమంగా నీటి సరఫరా అవ్వడంలేదు. అధికారులు పర్యవేక్షించి సరి చేయాలి.
–కర్రి సత్యనారాయణ, సర్పంచ్, తిమ్మాపురం
ఎస్.రాయవరం: ఇంటింటా కుళాయి ఏర్పాటు చేసి తాగునీరందించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆశయానికి తూట్లు పడుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కొరవడంతోపాటు పాయకరావుపేట నియోజకవర్గం వ్యాప్తంగా జల్‌జీవన్ మిషన్ పనులపై జవాబుదారీతనం లేకపోవడంతో నాణ్యత డొల్లగా మారింది. తాజాగా పెట్టుగోళ్లపల్లిలో వాటరు ట్యాంకు లీకులను చూసి ప్రారంభించకుండా వెళ్లిపోయిన హోంమంత్రి ఘటనే సాక్షీభూతంగా నిలిచింది. ఈ వ్యవహారంతో కంగుతిన్న అధికారులు ఉరుకులు పరుగులు తీశారు. మిగిలిన ట్యాంకుల పనులను చక్కదిద్దే పనిలో పడ్డారు.
జల్ జీవన్ మిషన్ పనులు రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉండగా, ఇంతవరకూ నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాల్లో 60 శాతం గ్రామాల్లో పనులు ప్రారంభించారు. మిగిలిన గ్రామాల్లో కదలిక లేదు. రూ.200 కోట్లతో ప్రారంభమైన పనులు నత్తనడకన నడవడమే కాకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా కాంట్రాక్టరు అందుబాటులో ఉండటం లేదు. సంబంధిత సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం లేదు. ఈ పనులపై ప్రశ్నిస్తున్న ఆయా గ్రామాల సర్పంచ్‌లకు సమాధానం ఉండటం లేదు.
లీకులు కారణంగా ప్రారంభానికి నోచుకోనిసర్వసిద్ధి వాటర్ ట్యాంకు
పెట్టుగోళ్లపల్లిలో లీకు కారణంగా హోంమంత్రి ప్రారంభోత్సవం నిలిపివేసిన ట్యాంకు
తడపకపోవడం వల్ల ట్యాంకులకు ముప్పు
వాటర్ ట్యాంకు నిర్మాణంలో దశలవారీగా తడుపుతూ రావాలి. నిర్మాణం పూర్తయిన తర్వాత కనీసం నెల రోజుల పాటు తడపాలి. ఎప్పటికప్పుడు తడపకుండా వదిలేస్తే కొన్నాళ్లకే ట్యాంకు బీటలు వారడం, లీకులు ఏర్పడటం, పూర్తిగా పటుత్వం కోల్పోయి కూలిపోతుంది. అయితే గ్రామాల్లో ఇంతవరకు నిర్మించిన ట్యాంకులను పూర్తిస్థాయిలో తడిపిన దాఖలాలు లేవని ఆయా గ్రామస్తులు వాపోతున్నారు.
పైపులైన్ల కోసం రోడ్లు తవ్వేసి..
గ్రామ వీధుల్లో సీసీ రోడ్లు పగులగొట్టి వేసిన పైపులైన్లు వేసి అసంపూర్తిగా వదిలేశారు. ఆ రోడ్లను తవ్వేసి మళ్లీ కప్పకపోవడంతో రాకపోకల సమయంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వేసిన పైపులైన్ల నుంచి చుక్క తాగునీరు రావడం లేదని ప్రజలు వాపోతున్నారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో రెండేళ్ల క్రితం జల్ జీవన్ మిషన్ నిధులతో 60 రక్షిత మంచినీటి ట్యాంకుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో 26 ట్యాంకులు నిర్మాణం పూర్తికాగా, మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. అందులో తొలుత పెట్టుగోళ్లపల్లిలో కోటి 9 లక్షల 50 వేల రూపాయలతో నిర్మించిన ట్యాంకును హోంమంత్రి అనిత బుధవారం ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. లీకులతో ట్యాంకు నుంచి నీరు కారడంతో ప్రారంభోత్సవం నిలిపివేశారు. పనుల్లో నాణ్యత లేదని చెప్పి ఆమె వెళ్లిపోయారు. అదేక్రమంలో సర్వసిద్ధిలో నిర్మించిన ట్యాంకు లీకులు రావడంతో ప్రారంభోత్సవం వాయిదా వేసుకున్నారు. తిమ్మాపురం, కొరుప్రోలు గ్రామాల్లో వాటర్ ట్యాంకుల పనులు చేసి తడపడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఇలా పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన జలజీవన్ మిషన్ పనులు నాసిరకంగా ఉన్నాయని ఆయా గ్రామస్తులు విమర్శిస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పనులు సక్రమంగా చేపట్టాలని కోరుతున్నారు.
జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత లోపం.!
జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత లోపం.!
జల్ జీవన్ మిషన్ పనుల్లో నాణ్యత లోపం.!


