నేటి నుంచి భాగస్వామ్య సదస్సు
హాజరుకానున్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ అబ్దుల్ నజీర్ కేంద్రమంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు జరగనున్న సదస్సు
సాక్షి, విశాఖపట్నం : భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) 30వ భాగస్వామ్య సదస్సు ఏయూ ఇంజినీరింగ్ మైదానంలో శుక్ర, శనివారాల్లో సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ సదస్సును శుక్రవారం ఉదయం 8.30 గంటలకు భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్లీనరీ హాల్ ప్రధాన వేదికగా ఉండగా దానికి అనుబంధంగా వివిధ హాళ్లను ఏర్పాటు చేశారు. ఆయా హాళ్లలో వివిధ ప్లినరీ సెషన్లు జరగనున్నాయి. తొలిరోజు సదస్సులో గౌరవ అతిథిగా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి పీయూష్ గోయల్, సీఎం చంద్రబాబు కీలకోపాన్యాసం చేయనున్నారు. సదస్సుకు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. ఉదయం 10.30 నుంచి 11.45 వరకు జరిగే ఓపెనింగ్ ప్లీనరీ కార్యక్రమంలో వివిధ పరిశ్రమల ప్రతినిధులతో పాటు కేంద్రమంత్రి గోయల్, చంద్రబాబు పాల్గొంటారు. దీంతో పాటు రాత్రి 8 గంటల వరకూ వివిధ కాన్పరెన్స్ హాల్స్‌లో ప్లీనరీ సెషన్లు జరగనున్నాయి. ఈ సదస్సుకు ఇప్పటికే జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన దాదాపు రూ.50 కోట్ల ప్రజాధనంతో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా రాష్ట్ర ఖ్యాతిని చాటి చెప్పేవిధంగా.. దేశ రాజధాని ఢిల్లీ సహా ముంబయి హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, విజయవాడ నగరాల్లోని ప్రధాన కూడళ్లు, విమానాశ్రయాల్లో పలు హోర్డింగులు, డిజిటల్ డిస్‌ప్లేలు ఏర్పాటు చేశారు. నగరమంతా సీఐఐ సదస్సుకు సంబంధించి పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటయ్యాయి.
తొలిరోజు ఒప్పందాలు
తొలి రోజున వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనుంది. ఇప్పటికే గురువారం రాత్రి వరకూ పరిశ్రమల శాఖ 9 ఎంవోయూలు, ఐఅండ్‌ఐ 3, ఆహారశుద్ధి శాఖ 4, ఇంధన శాఖ 6, సీఆర్‌డీఏ 8 ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. తొలి రోజు సదస్సులో భాగంగా సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల మధ్యలో ప్రధాన వేదిక ప్రాంగణంలో హాల్ నంబరు 7లో పరిశ్రమల శాఖ 14, ఐఅండ్ ఐ 15,ఆహార శుద్ధి శాఖ 6, ఇంధన శాఖ 21 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు అధికారులు తెలిపారు.


