కూలిన స్లూయిజ్
నిలిచిన తాండవ సాగునీరు
నాతవరం: తాండవ రిజర్వాయరు ఆయకట్టు భూములకు నీరు ప్రవహించేందుకు మండలంలోని గునుపూడి సమీపంలో ఏలేరు కాలువపై నిర్మించిన స్లూయిజ్ కూలిపోయింది. దీంతో శివారు ఆయకట్టుకు నీటి ప్రవాహం ఆగిపోవడంతో ఆయకట్టుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలేశ్వరం ప్రాజెక్టు నుంచి విశాఖ స్టీల్‌ప్లాంటుకు నీరు సరఫరా చేసేందుకు గునుపూడి వద్ద ఏలేరు కాలువ ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అడ్డుగా ఉన్న తాండవ కాలువను తొలగించి స్లూయిజ్ నిర్మించారు. అప్పట్నుంచి దిగువ ప్రాంతంలో ఏలేరు కాలువ నీరు, ఎగువ ప్రాంతంలో నిర్మించిన స్లూయిజ్ కాలువలో తాండవ నీరు ప్రవహిస్తోంది. ఇది నిర్మించి 40 ఏళ్లు పైబడటంతో ఏలేరు కాలువపై స్లూయిజ్ రెండు రోజుల క్రితం కూలిపోయింది.
పస్తుతం పొట్టదశలో వరి చేను ఉండటం, అటు నీరు ప్రవాహం ఆగిపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు. ఇక్కడ స్లూయిజ్ కూలిపోయిన విషయాన్ని గునుపూడి తాండవ నీటి సంఘం అధ్యక్షుడు సబ్బవరపు దేముడు తాండవ, ఏలేరు అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పని ఏలేరు, విశాఖపట్నం విస్కో అధికారులు సంయుక్తంగా చేయాల్సి ఉంది. యుద్ధప్రాతిపదికన స్లూయిజ్ కాలువ మరమ్మతులు పూర్తి చేసి సాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయమై తాండవ ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్‌ను సంప్రదించగా ఏలేరు అధికారులు పరిశీలించారని, త్వరగా బాగు చేసి రైతులకు సాగునీరు ఇస్తామన్నారు.


