పైసలిస్తేనే ఫైలు కదిలేది..!
దేవరాపల్లి: స్థానిక తహసీల్దార్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు కొందరు ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి పేద ప్రజల నుంచి ముక్కు పిండి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫైల్స్ ముందుకు కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందేనంటూ బరి తెగిస్తున్నారని పలువురు బాధితులు బహిరంగంగా విమర్శిస్తున్నారు. భూ సమస్యలు, మ్యుటేషన్ కోసం వచ్చే సామాన్య ప్రజలకు కుంటి సాకులు చూపి నెలల తరబడి తిప్పించుకుంటూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. తండ్రి పేరిట ఉన్న భూమిని కుమారుడి పేరిట మార్చేందుకు ఎం.అలమండ వీఆర్వో రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీసీ అధికారులకు దొరికిన వైనం తాజా ఉదాహరణగా నిలుస్తోంది. గతంలో దేవరాపల్లి మండల సర్వేయర్ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అయినప్పటికీ ఇక్కడ అవినీతి, అక్రమాలు ‘మామూలే’ అన్నట్టు పరిస్థితి తయారైంది. వారు అడిగినంత ముట్టచెప్పకపోతే ఫైల్స్‌ను సైతం మాయం చేసి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ రైతులకు నరకం చూపిస్తున్నారు. భూముల ఆన్‌లైన్, భూమి పట్టాదారు పాసుపుస్తకం, సబ్ డివిజన్, సర్వే తదితర భూ సమస్యలపై రెవెన్యూ అధికారులను ఆశ్రయించాలంటే పేద ప్రజలు భయపడుతున్న దారుణ పరిస్థితి నెలకొంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, మధ్యవర్తులు తీసుకువచ్చే ఫైల్స్‌కు భారీ మొత్తంలో పైసలు దండుకొని యుద్ధప్రాతిపదికన క్లియర్ చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ జోక్యం.. ప్రైవేటు పెత్తనం
టీడీపీ నాయకుల అండతో కొందరు వీఆర్వోలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నాయకుల సేవలో తరిస్తూ ఏకపక్షంగా ఉంటూ సామాన్య ప్రజల సమస్యలను పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. సామాన్య ప్రజలు అడిగితే కనీసం సమాధానం ఇవ్వని దయనీయ పరిస్థితి నెలకొంది. రాజకీయ నాయకుల సిఫార్సులతో ఏళ్ల తరబడి కొందరు ఒకే గ్రామంలో, మరికొందరు ఇదే మండలంలో తిష్ట వేసి ప్రజలను పట్టి పీడిస్తున్నారు. పై స్థాయి అధికారులు చోద్యం చూడటంతో మరింత రెచ్చిపోతున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి దుస్థితి ఉండేది కాదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న విషయం తన దృష్టికి రావడంతో అప్పటి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బూడి ముత్యాలనాయుడు తీవ్ర స్థాయిలో స్పందించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.
నేరుగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ప్రైవేటు వ్యక్తులను బయటకు పంపించి, అధికారులకు సైతం ముత్యాలనాయుడు హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు అధికార తెలుగుదేశం నాయకులే అవినీతిని ప్రోత్సహించడంతో పరిస్థితి దిగజారిందని చెబుతున్నారు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల పెత్తనం మితిమీరింది. పలువురు వ్యక్తులు దర్జాగా అధికారుల సీట్లలో కూర్చొని కార్యకలాపాలు సాగిస్తున్నారు. కొందరు వీఆర్వోలు ఈ ప్రైవేటు వ్యక్తుల ద్వారానే అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏసీబీ అధికారులు దేవరాపల్లి తహసీల్దార్ కార్యాలయంతోపాటు వీఆర్వోల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలుస్తోంది.


